- అంబులెన్స్ లేక వృద్ధురాలి మృతి
- ఆసుపత్రిలో బంధువుల ఆందోళన
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, ఏప్రిల్ 01:
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సరైన సమయంలో వైద్యం అందక, అంబులెన్స్ రాక ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఏర్పుల పకీరమ్మ (65) బుధవారం ఉదయం తన ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా కాలుజారి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఉన్న వైద్యుడు పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా నామమాత్రపు చికిత్స చేసి వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
చికిత్స ప్రారంభించిన 30 నిమిషాల తర్వాత పకీరమ్మ ఆరోగ్యం క్షీణించడంతో, వైద్య సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని వైద్యులు ముందే చెప్పకపోవడంతో, సమయం మించిపోయి ఆ వృద్ధురాలు ఆసుపత్రిలోనే కన్నుమూసింది.

కన్నీరుమున్నీరైన కొడుకు: “మా అమ్మ ప్రాణాలతో ఉండగానే మాకు సమాచారం ఇచ్చి ఉంటే మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా తల్లి చనిపోయింది” అని పకీరమ్మ కుమారుడు మోహన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

ఆసుపత్రిలో అడుగడుగునా అవస్థలు: కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రక్త పరీక్షలు కూడా చేయలేని దుస్థితి నెలకొందని, చిన్న సమస్య వచ్చినా తాండూరు, వికారాబాద్ లేదా హైదరాబాద్ వెళ్లాలని వైద్యులు రాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఒక గర్భిణీకి ప్రసవం కష్టమని భయపెట్టి హైదరాబాద్ పంపగా, మార్గమధ్యలోనే సాధారణ ప్రసవం జరిగిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పాఠాల పేరుతో పరువు తీస్తున్న పంతుళ్లు


