- వ్యవసాయ అధికారులు లేక నిర్లక్ష్యానికి గురవుతున్న రైతు సేవలు
- కొడంగల్లో వ్యవసాయ శాఖ ఇష్టారాజ్యం..? రైతుల ఆందోళన
శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్, ఆగస్టు 4 :
రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడం, పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమావేశాలకు వేదికగా నిలవాల్సిన రైతు వేదికలు ప్రస్తుతం తమ అసలు లక్ష్యాన్ని కోల్పోయి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు స్టోర్రూమ్లుగా మారుతున్నాయనే ఆరోపణలు కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ వ్యవసాయ శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడం, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఇన్చార్జ్ వ్యవస్థతో శాఖను నడిపించడం వంటి కారణాల వల్ల రైతులకు అందాల్సిన సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏడీఏ (Assistant Director of Agriculture) పోస్టు ఖాళీగా ఉండటంతో పాటు, గత నెల రోజులుగా వ్యవసాయ అధికారి (AO) అందుబాటులో లేకపోవడం, పలువురు ఏఈఓలను విధుల నుంచి తొలగించడం వంటి పరిణామాలతో వ్యవసాయ శాఖ పనితీరు పూర్తిగా మందగించిందని పేర్కొంటున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక రైతుల ఇబ్బందులు
వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వడం, పంటల స్థితిగతులను పరిశీలించడం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం అలాంటి పర్యవేక్షణ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. రైతు సమస్యలను వినేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు.

నకిలీ ఎరువుల విక్రయాలపై చర్యలు ఎక్కడ..?
ఇటీవల జిల్లాలో నకిలీ డీఏపీ, నకిలీ యూరియా, నకిలీ పురుగుమందుల విక్రయాలు జరుగుతున్నాయంటూ రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ ఇన్పుట్ల నాణ్యతను పర్యవేక్షించి అక్రమాలను అరికట్టాల్సిన శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
కొంతమంది ఎరువుల దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

రైతు వేదికలు తుప్పు పట్టే పరిస్థితి
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఉపయోగపడాల్సి ఉండగా ప్రస్తుతం నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. అనేక చోట్ల రైతు సమావేశాలు నిర్వహించకపోవడం, వ్యవసాయ అధికారులు రావడం తగ్గిపోవడంతో భవనాలు మూతపడిన పరిస్థితి నెలకొంది. నిర్వహణ లేక తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రి దెబ్బతింటుండగా భవనాలు కూడా శిథిలావస్థకు చేరుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుద్రారం రైతు వేదికలో కాంట్రాక్టర్ సామగ్రి నిల్వ
కొడంగల్ నియోజకవర్గంలోని రుద్రారం క్లస్టర్ రైతు వేదిక ప్రస్తుతం ప్రైవేట్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ ఆధీనంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) రోడ్డు పనులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్ రైతు వేదికను స్టోర్రూమ్గా వినియోగిస్తూ సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి తదితర వస్తువులను అక్కడ నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ భవనాన్ని ప్రైవేట్ సంస్థ అవసరాలకు ఉపయోగించడం ఎలా సాధ్యమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? సంబంధిత శాఖ అధికారులు దీనిపై ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై ప్రశ్నలు
రైతు వేదికలు రైతులకు సంబంధించిన ధాన్యం, వ్యవసాయ పరికరాలు లేదా శిక్షణ కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉండగా, ప్రైవేట్ కాంట్రాక్టర్ల సామగ్రి నిల్వ చేయడం ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ప్రభుత్వ భవనాల పరిరక్షణకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రైతు వేదికలను ప్రైవేట్ అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కొడంగల్ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేసి రైతులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల కోసం నిర్మించిన రైతు వేదికలు మళ్లీ రైతులకే ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యవసాయ శాఖలో నెలకొన్న సిబ్బంది కొరతను నివారించి క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


