శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ బీసీలను, విద్యార్థులను నిలువునా వంచించిందని తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన (TRVS) రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో TRVS ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా తప్పు బట్టారు ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీ జనాభాకు కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం అంటే బీసీలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ సబ్ ప్లాన్ ప్రకారం రూ. 20,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, ఆ ఊసే ఎత్తలేదని ఎత్తలేదని దుయ్యబట్టారు. జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రకులాల మంత్రుల చేతిలో ఉన్న శాఖలకు 51 శాతం బడ్జెట్ కేటాయించి, బహుజన వర్గాలకు తీవ్ర అవమానం చేశారని ఆరోపించారు. బడ్జెట్లో విద్యార్థుల సంక్షేమానికి, విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు, విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయంపై తమ పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ కేటాయింపులను సమీక్షించాలని రాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TRVS నాయకులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



