- పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర యాదవ్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ సెప్టెంబర్ 13
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ రవీంద్ర యాదవ్, కార్యదర్శి లయన్ డాక్టర్ సాకేత్, కోశాధికారి లయన్ కె. మురహరి వాశిష్ట, జాయింట్ సెక్రటరీ భీమరాజు, క్లబ్ సభ్యులు లయన్ దస్తప్ప, లయన్ ఆనంద్ కుమార్ లహోటి, లయన్ నందారం వెంకటరత్నం తదితరులు, భక్తులు పాల్గొన్నారు.


