- అధికారుల ఆదేశాలు బేఖాతరు.. తనిఖీలు ఎక్కడ?
- దాడులు జరిగినా మారని పరిస్థితి.. వ్యవసాయ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు
- అర్ధరాత్రి వేళల్లో అక్రమ విక్రయాల ఆరోపణలు.. పట్టించుకోని అధికారులు?
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ సెప్టెంబర్ 12 :
కొడంగల్ పట్టణంలో ఎరువుల విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఆదేశాలు జారీ చేయడం తప్ప.. అవి అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించకపోవడంతో కొందరు వ్యాపారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల కొడంగల్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువుల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయించడం, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం వంటి అంశాలపై దాడులు చేపట్టి పలు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించిన కొన్ని దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయించాల్సిన బాధ్యత కలిగిన స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఆ తర్వాత ఎలాంటి పర్యవేక్షణ చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆదేశాలు కాగితాలకే పరిమితమా?
విశ్వసనీయ సమాచారం మేరకు.. తనిఖీలకు గురైన ఓ ఎరువుల దుకాణంపై విక్రయాలు నిలిపివేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఎరువులను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోల ద్వారా ఎరువులను తరలించి రహస్యంగా విక్రయిస్తున్నారనే ప్రచారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఇంత జరుగుతున్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు? అక్రమ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అధికారులు జారీ చేసిన ఆదేశాలను వ్యాపారులు బేఖాతరు చేస్తుంటే.. వాటిని అమలు చేయించాల్సిన అధికారులు మాత్రం మౌనం వహించడం వెనుక కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
దాడులు చేసింది విజిలెన్స్ అధికారులు.. మరి స్థానిక అధికారులు?
ఎరువుల అక్రమ విక్రయాలను గుర్తించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక అధికారులు రావాల్సిన పరిస్థితి ఏర్పడటం స్థానిక వ్యవసాయ శాఖ పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. స్థానికంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ఉంటే.. బయటి శాఖల అధికారులు ప్రత్యేకంగా వచ్చి దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత కూడా స్థానిక అధికారులు అప్రమత్తం కాకపోవడం, దుకాణాలపై నిఘా పెట్టకపోవడం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. దాడులు జరిగిన సమయంలో మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే అక్రమ విక్రయాలకు మార్గం సుగమమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు ఎక్కడ? పర్యవేక్షణ ఏది?
ఎరువుల విక్రయాలపై నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటి అమలును పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దుకాణాల్లో స్టాక్ వివరాలు, ధరల పట్టికలు, విక్రయ రికార్డులు, రైతులకు ఇచ్చే బిల్లులు వంటి అంశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ.. అలాంటి తనిఖీలు ఎక్కడా జరగడం లేదని స్థానికులు అంటున్నారు.
అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమైపోయి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఇన్చార్జి పాలనతో మరింత నిర్లక్ష్యం?
కొడంగల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రెగ్యులర్ అధికారులు లేకపోవడం, ఇన్చార్జి అధికారులతోనే పాలన కొనసాగుతుండటం వల్ల పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందనే విమర్శలు ఉన్నాయి. కీలకమైన వ్యవసాయ శాఖలో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్ల రైతుల సమస్యలు, ఎరువుల సరఫరా, దుకాణాల తనిఖీలు, అక్రమ విక్రయాల నియంత్రణ వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న అధికారులు తమ పరిధిలోని దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఎక్కడా తనిఖీలు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొందరు వ్యాపారులు అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
కొడంగల్లో ఎరువుల విక్రయాలపై స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన దుకాణాలపై అనంతరం స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆదేశాలు అమలవుతున్నాయా లేదా తనిఖీ చేశారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ విక్రయాలపై ఫిర్యాదులు వచ్చినా స్పందించని అధికారులు, తనిఖీలు నిర్వహించని సిబ్బంది, ఆదేశాలను అమలు చేయించడంలో విఫలమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైతులకు నష్టం కలిగించే ఎరువుల అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తే.. ప్రభుత్వం ప్రతిష్టకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారులు కేవలం ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోకుండా.. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొడంగల్ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


