శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడమే కాకుండా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ది హిందూ హడిల్ కార్యక్రమంలో ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్‌తో జరిగిన ముఖాముఖి సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సవివరంగా మాట్లాడారు.
ఎన్.రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రభుత్వం మూడు ప్రధాన ఆర్థిక మండలాల ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని ప్రాంతాన్ని క్యూర్ (Core Urban Region Economy – CURE), ఓఆర్ఆర్ మరియు రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) మధ్య ప్రాంతాన్ని ప్యూర్ (Peri Urban Region Economy – PURE), ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాన్ని రేర్ (Rural Agricultural Region Economy – RARE) గా విభజించి అభివృద్ధి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

క్యూర్‌లో సేవారంగం.. నెట్ జీరో సిటీ లక్ష్యం
క్యూర్ పరిధిలో సేవారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, హైదరాబాద్‌ను భవిష్యత్తులో నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నగరంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈవీ వాహనాలపై పన్నులు ఎత్తివేసినట్లు, దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.2 వేల కోట్ల ఆదాయ నష్టం వచ్చినా భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
అదే విధంగా మెట్రో రైలు విస్తరణ, చెరువుల ఆక్రమణల తొలగింపు, వాటి పునరుద్ధరణ, వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలు నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

ప్యూర్‌లో పరిశ్రమలకు పెద్దపీట
ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు ఆకర్షించి భారీ పెట్టుబడులు రాబట్టేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
మచిలీపట్నం పోర్టుతో తెలంగాణ అనుసంధానం
భూపరివేష్టిత రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు సముద్రతీరం లేకపోవడం ఒక సవాలుగా మారిందని సీఎం పేర్కొన్నారు. అయితే దీనిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపి తెలంగాణను మచిలీపట్నం పోర్టుతో 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ కారిడార్ ద్వారా అనుసంధానం చేసే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు, రైలు, పోర్టు, విమానాశ్రయాల సమగ్ర అనుసంధానం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో ఇప్పటికే ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం కొనసాగుతోందని, దీనివల్ల అనేక వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువతకు కొత్త నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తుందని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా, శ్రీని రాజు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులే కోర్సుల రూపకల్పన నుంచి శిక్షణ, ఉద్యోగ కల్పన వరకు బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు.

కాలం చెల్లిన ఐటీఐలకు స్వస్తి
దేశంలో 1950ల కాలంలో ఏర్పాటైన అనేక ఐటీఐల్లో ఇప్పటికీ కాలం చెల్లిన కోర్సులు కొనసాగుతున్నాయని సీఎం విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో లేని అంబాసిడర్ కార్ల మరమ్మతులపై కూడా కొన్ని ఐటీఐల్లో శిక్షణ కొనసాగుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
“ఇప్పుడు రోడ్లపై ఆడీ, బీఎండబ్ల్యూ వంటి ఆధునిక వాహనాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని ఐటీఐల్లో మాత్రం అంబాసిడర్ కారు రిపేర్ కోర్సులే ఉన్నాయి. తెలంగాణలో అంబాసిడర్ కారు ఉంటే అది కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉంటుంది. వారి పార్టీ ఎన్నికల గుర్తు కూడా అంబాసిడర్ కారు. ఎవరైనా అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే అక్కడికే వెళ్లాలి” అంటూ ఆయన చమత్కరించారు.
టాటాతో ఒప్పందం.. ఏటీసీలుగా మారుతున్న ఐటీఐలు
ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఆధునీకరించేందుకు టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) మార్చే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు రూ.2,400 కోట్ల వ్యయం అవుతుందని, అందులో 86 శాతం నిధులను టాటా సంస్థే భరిస్తోందని వెల్లడించారు.

బ్లూ కాలర్ ఉద్యోగాలే భవిష్యత్
భవిష్యత్తులో బ్లూ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలను సందర్శించి అక్కడి పరిశ్రమల అవసరాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం అనేక సందర్భాల్లో ఐటీ ఇంజినీర్ల కంటే నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ కార్మికులే అధిక వేతనాలు పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జర్మన్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
సమగ్ర ప్రణాళికతో ముందుకు తెలంగాణ
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ వంటి అన్ని రంగాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చర్యల ఫలితంగానే తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



