శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ మార్చి 30:
దుద్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి సంగీత వానికి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను పునరుద్ధరించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జి రామ్ జి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ వల్ల గ్రామీణ కుటుంబాలకు ఉపశమనం
గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలు కావడం వల్ల వందలాది కుటుంబాలు వ్యవసాయ పనులు లేని కాలంలో 100 రోజుల ఉపాధి పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామంలో సీసీ రోడ్లు, రైతు వేదికలు, కాకతీయ మిషన్ కింద చెరువుల అభివృద్ధి, పాఠశాల భవనాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు జరిగాయని పేర్కొన్నారు.
నిధుల విషయంలో కేంద్రంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90 శాతం నిధులు అందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, గ్రామపంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కానీ కొత్త పథకం ద్వారా ఈ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని ఆరోపించారు.

కొత్త పథకంపై అసంతృప్తి
వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి. చంద్రయ్య మాట్లాడుతూ, కొత్త పథకం ప్రకారం 125 రోజులు పని పెంచినట్లు చెప్పినా, వాస్తవంగా నిధుల విషయంలో స్పష్టత లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల, రాష్ట్రం డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆగిపోతాయని పేర్కొన్నారు.
పథకం మార్పులతో కలిగే సమస్యలు
కొత్త చట్టం ప్రకారం:
- వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పని ఆపే అవకాశం ఉంది
- మహాత్మా గాంధీ పేరును తొలగించారు
- కూలీలకు ఇచ్చే అలవెన్సులు, ఉద్యోగ భద్రతపై స్పష్టత లేదు
- కేంద్రం సూచించిన పనులు మాత్రమే గ్రామపంచాయతీలు చేయాలి
- వేతనాలు కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే చెల్లింపు
ఈ మార్పులు గ్రామీణ కూలీలకు నష్టదాయకమని వారు అభిప్రాయపడ్డారు.
పాత చట్టం పునరుద్ధరణకు డిమాండ్
గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలని, దీనిపై గ్రామపంచాయతీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు.
కార్యక్రమంలో కనకమ్మ, మల్కమ్మ, సాయమ్మ, ఎల్లమ్మ, అనంతమ్మ, రాములమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మయ్య, నరసయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపల్లి పరమేశ్వరుని గుట్టపై అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం


