కోడంగల్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

  • వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు – పంటలు ఎండిపోతున్నాయి
  • పెట్టుబడులు నష్టపోయి అప్పుల భారంలో రైతులు
  • తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 5 :

కోడంగల్ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోడంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వర్షాధారంగా సాగు చేసిన పంటలకు తగినంత నీరు అందక ఎండిపోతున్నాయని అన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీల కోసం రైతులు భారీగా పెట్టుబడులు పెట్టినా పంట చేతికి రాక ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడం, బోర్లలో నీటిమట్టాలు తగ్గిపోవడంతో పంటలను కాపాడుకోవడం రైతులకు భారంగా మారిందన్నారు. పంట నష్టంతో ఆదాయం తగ్గుతుండగా, వ్యవసాయ పెట్టుబడులు, కుటుంబ ఖర్చులు, గతంలో చేసిన అప్పుల భారం పెరుగుతోందని తెలిపారు. పశువుల పెంపకంపై ఆధారపడుతున్న రైతులకు సైతం తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడే పరిస్థితి ఉందన్నారు.

కోడంగల్ ప్రాంతంలోని గ్రామాల్లో పంట నష్టంపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలపై ఉపశమన చర్యలు చేపట్టడంతో పాటు పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచాలని కోరారు.

చెరువులు, కుంటలు, కాలువలకు మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గంటి సురేష్ కుమార్ కోరారు. కోడంగల్ ప్రాంతానికి ప్రత్యేక కరువు సహాయక ప్యాకేజీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles