కొడంగల్‌లో విద్యుత్ చార్జీల మోత!

  • 52 యూనిట్లకే రూ.442..
  • అదనపు చార్జీలతో వ్యాపారస్తులపై భారం
  • విద్యుత్ బిల్లులపై పట్టణ వ్యాపారస్తుల ఆగ్రహం

శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, నవంబర్ 2:

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో విద్యుత్ చార్జీల మోత మోగుతోందని పట్టణ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగానికే భారీగా బిల్లులు వస్తుండటంతో సామాన్య వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

పట్టణంలోని ఓ వ్యాపారస్తుడికి సంబంధించిన కేటగిరీ-2 విద్యుత్ మీటర్‌పై 30 రోజుల వ్యవధిలో కేవలం 52 యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే, యూనిట్‌కు రూ.8.80 చొప్పున విద్యుత్ చార్జీలు రూ.442గా బిల్లులో పేర్కొన్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. దీనికి అదనంగా ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో రూ.70, కస్టమర్ చార్జీల రూపంలో రూ.90, ఎలక్ట్రిసిటీ డ్యూటీగా రూ.3.12, ఇతర చార్జీల రూపంలో రూ.157, మరో రూ.13.20తో పాటు వివిధ రకాల అదనపు చార్జీలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కేవలం 52 యూనిట్ల విద్యుత్ వినియోగానికే వందల రూపాయల అదనపు చార్జీలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. యూనిట్‌కు నిర్ణయించిన ధరతో పాటు ఈ స్థాయిలో అదనపు చార్జీలు విధించడం వల్ల చిన్న వ్యాపారాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై వ్యాపారస్తుల ఆగ్రహం

విద్యుత్ బిల్లులపై సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరితే తమకు సంబంధం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలనే ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

విద్యుత్ బిల్లుల్లో విధిస్తున్న అదనపు చార్జీలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని కొడంగల్ పట్టణ వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల విధానంపై స్పష్టమైన వివరణ ఇచ్చి, అన్యాయంగా వసూలు చేస్తున్న చార్జీలపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

లేనిపక్షంలో ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులైన అధికారులపై ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారస్తులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles