మాట తప్పడం.. మడమ తిప్పడం రేవంత్‌రెడ్డి ట్రేడ్‌మార్క్
ఈ నెల 18లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
లేదంటే హైదరాబాద్ దిగ్బంధానికి సిద్ధం కావాలి: కల్వకుంట్ల కవిత
శ్రీ బల భీమ న్యూస్ / బాగ్ లింగంపల్లి , హైదరాబాద్:
మాట తప్పడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరించడం సరికాదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ నెల 18లోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బాగ్‌లింగంపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సదస్సులో కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని భావించి రాష్ట్ర సాధన కోసం పోరాడారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఉద్యోగుల సహకారం లేకుండా పాలన సాధ్యం కాదు
ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పాలన అందించాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని కవిత అన్నారు. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే పరిపాలన సజావుగా సాగడం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాటి అమలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. ఉద్యోగులను గౌరవిస్తూ, వారికి భరోసా కల్పిస్తూ పనిచేయాల్సిన ప్రభుత్వం వారినే ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తామని కవిత తెలిపారు. ఉద్యోగులు సంతోషంగా, గౌరవంగా పనిచేసే వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తుందని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో దాదాపు 600 మండలాలు ఉన్నప్పటికీ పర్మినెంట్ ఎంఈఓలు చాలా తక్కువగా ఉన్నారని అన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పర్యవేక్షణ బలహీనపడుతోందని పేర్కొన్నారు. హెడ్‌మాస్టర్లు, సీనియర్ టీచర్లను ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసే విధంగా వివిధ రకాల రిపోర్టులు, ఇతర పనులు అప్పగిస్తున్నారని కవిత విమర్శించారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రకారం రావాల్సిన ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
గురుకులాలు, డిగ్రీ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ఒక పాఠశాల, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని తెలిపారు.
32 నెలలుగా డీఏ పెండింగ్
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని కవిత ఆరోపించారు. గతంలో ఇదే రేవంత్‌రెడ్డి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని పరిష్కరించడం లేదన్నారు.
ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసే పరిస్థితి ఉందని, తక్షణమే ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
2003 బ్యాచ్‌కు ఓపీఎస్ అమలు చేయాలి
2003లో నియమితులైన పోలీసులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. 2003లో నియమితులైన టీచర్లను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి గణనీయమైన మొత్తం ఆదా అవుతుందని, ఆ నిధులతో ఉద్యోగుల ఇతర బకాయిలను చెల్లించాలని సూచించారు.
పోలీసులు, ఉపాధ్యాయులకు రావాల్సిన అనేక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని కోరారు.
ఉద్యోగులు బానిసలు కాదు
తమ హక్కులు, ప్రయోజనాల కోసం ఉద్యోగులు ప్రశ్నిస్తే మరో రెండేళ్లు వేచి ఉండాలని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదని కవిత అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై పోరాటం విషయంలో పదేపదే ఆందోళనలను వాయిదా వేసుకోవడం వల్ల కిందిస్థాయి ఉద్యోగుల్లో సంఘాలపై నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని దాదాపు 206 ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాయని, వారి పోరాటానికి తమ పార్టీ నైతికంగా, అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
317 జీవో బాధితులకు న్యాయం చేయాలి
317 జీవో బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కూడా 317 జీవో బాధితులకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నించానని, అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉండటం తనను బాధిస్తోందని కవిత పేర్కొన్నారు.
హెల్త్ కార్డులపై ఓపెన్ ఛాలెంజ్
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న హెల్త్ కార్డు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సక్రమంగా పనిచేస్తుందా అని ముఖ్యమంత్రిని కవిత ప్రశ్నించారు. హెల్త్ కార్డు నిజంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తుందని ప్రభుత్వం నిరూపిస్తే తాము ఏం చేయమంటే అది చేస్తామని సవాల్ చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
18లోగా హామీలు నెరవేర్చాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కవిత తెలిపారు. ఆ గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ దిగ్బంధానికి పిలుపునివ్వాలని సూచించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని, వారి పోరాటానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన ప్రజలకు, ఉద్యోగులకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. జీతాలు సకాలంలో అందకపోయినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారు తమ విధులను కొనసాగిస్తున్నారని అన్నారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, వారి సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది తమ హక్కుల కోసం చేసే పోరాటాలకు తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తాయని కవిత స్పష్టం చేశారు.


