- 7,500 కిలోల కల్తీ బెల్లం స్వాధీనం – ఇద్దరు అరెస్ట్
శ్రీ బల భీమ న్యూస్ / వికారాబాద్ (ఆగస్టు 14) :
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ బెల్లం వ్యాపారులపై వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. భారీగా కల్తీ బెల్లాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ SK అన్వార్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బంట్వారం మండలం బోపనారం వద్ద ఆటోలో తాండూరుకు తరలిస్తున్న సుమారు 4 క్వింటాళ్ల కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి చంద్ పాషా, ఆటో డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బెల్లాన్ని కూడా పోలీసులు గుర్తించారు.
దుకాణంలోని నిల్వలతో కలిపి మొత్తం 7,500 కిలోల కల్తీ బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బంట్వారం పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ వ్యాపారాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.


