పిడుగు పడి మహిళ మృతి
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్( ఆగస్టు 12) : వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండలం టేకులగడ్డ తండాలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం తండాకు చెందిన కవిత్ అనే రైతు పొలానికి వరి నాటు వేయడానికి కూలీ పనికి వెళ్లిన లాలిబాయి (26) పిడుగుపాటుకు గురై మృతిచెందింది.
వరి నాటు వేస్తుండగా వర్షం రావడంతో లాలిబాయితో పాటు కూలీలు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో లాలిబాయిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన మంగిబాయి, కిషన్‌లను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భర్త అనారోగ్యం కారణంగా లాలిబాయి కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


