పీఏసీఎస్ అధ్యక్ష ఎన్నికపై ప్రజాభిప్రాయ సేకరణ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , ఆగస్టు 13:

కొడంగల్ మండలంలోని హస్నాబాద్ పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. పీఏసీఎస్ చైర్మన్ పదవికి పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆశావహుల అభిప్రాయాలను సేకరించారు.

మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మాజీ  చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పీఏసీఎస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పీఏసీఎస్ చైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు.

చైర్మన్ పదవికి పలువురు ఆశావహులు

పీఏసీఎస్ చైర్మన్ పదవి తమకు దక్కాలని పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదే సమయంలో మరికొందరు నాయకులు వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ఆశావహుల పేర్లను ప్రతిపాదించారు.

కొడంగల్ పట్టణానికి చెందిన మిఠాయి రాజు . అలాగే దీపక్ రెడ్డి పేరును సంతోష్ పాటమీదిపల్లి ప్రతిపాదించినట్లు తెలిసింది. నాగారం గ్రామం నుంచి బసంత్ రెడ్డి, రుద్రారం నుంచి బిక్షపతి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కట్కేం శివకుమార్, హస్నాబాద్ నుంచి మల్లేశం, కొడంగల్ గాంధీనగర్ నుంచి జూనియర్ కృష్ణంరాజు తదితరుల పేర్లు కూడా చైర్మన్ పదవికి ఆశావహులుగా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

హస్నాబాద్‌కే చైర్మన్ పదవి ఇవ్వాలని రైతుల డిమాండ్

హస్నాబాద్ పీఏసీఎస్ చైర్మన్ పదవిని హస్నాబాద్ ప్రాంతానికే కేటాయించాలని పలువురు రైతులు, స్థానిక నాయకులు డిమాండ్ చేసినట్లు సమావేశంలో చర్చ జరిగింది. పీఏసీఎస్ పరిధిలోని రైతుల సమస్యలను తెలుసుకున్న స్థానిక నాయకుడికి అవకాశం కల్పిస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడినట్లు తెలిసింది.

పీఏసీఎస్ చైర్మన్ ఎన్నికలో స్థానిక పరిస్థితులు, పార్టీకి చేసిన సేవలు, నాయకత్వ సామర్థ్యం, ప్రజలతో ఉన్న సంబంధాలు, రైతులతో ఉన్న అనుబంధం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు నాయకులు సూచించినట్లు సమాచారం.

అధిష్ఠానం నిర్ణయమే తుది

సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆశావహుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సేకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని నాయకులు స్పష్టం చేసినట్లు తెలిసింది.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులు, కార్యకర్తలను అధిష్ఠానం గుర్తిస్తుందని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. పార్టీకి చేసిన సేవలు, క్షేత్రస్థాయిలో పనిచేసిన తీరును పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు తదితర అవకాశాలు కల్పిస్తామని నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.

కుల, మతాలకు అతీతంగా అవకాశం

పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ కుల, మతాలకు అతీతంగా గుర్తించి, ఎలాంటి వివక్షకు తావులేకుండా పదవుల కేటాయింపు ఉంటుందని సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు సామాజిక సమీకరణాలు, స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని నాయకులు వెల్లడించినట్లు సమాచారం.

పీఏసీఎస్ చైర్మన్ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న అంశంపై కొడంగల్ మండలంలో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆశావహులు, వారి అనుచరులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ సమావేశంలో Tpcc  సభ్యులు మహమ్మద్ యూసుఫ్, పార్టీ జిల్లా కార్యదర్శి బాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నయుం , రుద్రారం ఆనంద్ రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మునీర్, రమేష్ బాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ అలీ ఖాన్ , తదితరులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Previous article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles