- రోజువారి కూలీల పరిస్థితి దయనీయంగా మారుతోందా..?
- బీహార్, ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలతో పనులు.. భద్రతా చర్యలపై ప్రశ్నలు
- అనారోగ్య సమస్యలు, ప్రమాదాలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికుల ఆరోపణలు
- కార్మిక సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ప్రతినిధి ( జూలై 25) :
కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక అభివృద్ధి పనుల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్వీకే (SVK) నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ సంస్థకు పలు నిర్మాణ పనుల టెండర్లు లభించాయి. అయితే పనులు ప్రారంభమై దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా నిర్మాణ పనుల కోసం స్థానిక కార్మికుల కంటే బీహార్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలను తీసుకువచ్చి పనిచేయిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారికి కనీస భద్రతా ప్రమాణాలు, కార్మిక సంక్షేమ సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణ చర్యలు కల్పించడం లేదని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు.
కూలీలకు హెల్మెట్లు, సేఫ్టీ షూస్, రిఫ్లెక్టివ్ జాకెట్లు, సేఫ్టీ బెల్టులు వంటి రక్షణ పరికరాలు సరైన స్థాయిలో అందించడం లేదని, ప్రమాదకర పరిస్థితుల్లోనే పనులు చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. నిర్మాణ రంగంలో ప్రతిరోజూ భారీ యంత్రాలు, టిప్పర్లు, క్రేన్లు, ఎర్త్మూవర్లు తిరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు అత్యంత కీలకమని కార్మికులు పేర్కొంటున్నారు.

ప్రమాదాల పరంపరపై ఆందోళన
ఇటీవలి కాలంలో సంస్థకు సంబంధించిన పనుల వద్ద చోటుచేసుకున్న పలు ప్రమాదాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. కొద్ది రోజుల క్రితం సంస్థకు చెందిన టిప్పర్ లారీ పాత కొడంగల్ తాండాకు చెందిన ఓ యువకుడిని ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
అదేవిధంగా గుండ్లకుంట గ్రామ శివారులో నిర్మాణ పనుల సందర్భంగా మరో టిప్పర్ లారీ టైర్లు అగ్నికి ఆహుతైన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో భద్రతా చర్యల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనారోగ్యంతో ఉన్నా పనులకు పంపుతున్నారనే ఆరోపణలు
కార్మికులు చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే, అనారోగ్యానికి గురైన కార్మికులకు విశ్రాంతి ఇవ్వకుండా పనులకు హాజరుకావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారనేది. సైటులో పని చేస్తుండగా ఒక కార్మికుడు సొమ్మసిల్లి పడిపోవడంతో, అప్పటి నుంచి తరచూ ఫిట్స్ వస్తున్నాయని అతడు కాంట్రాక్టర్‌కు పలుమార్లు తెలిపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బయలుభూమికి వెళ్లిన సమయంలో ఆ కార్మికుడికి ఒక్కసారిగా మళ్లీ ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే తోటి కార్మికులు స్పందించి కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
సకాలంలో సహచర కార్మికులు స్పందించకపోయి ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉండేదని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు కార్మికులు పేర్కొన్నారు.

మద్యం సేవించి కిందపడిన కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం
కొద్ది రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ దినసరి కూలీ మద్యం సేవించిన అనంతరం అర్ధరాత్రి సమయంలో మంచం మీద నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

ప్రమాదాల తర్వాత శాంతి పూజలు చేశారనే ప్రచారం
ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడంతో సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ మేకలు, గొర్రెలను తీసుకువచ్చి టిప్పర్ వాహనాలకు శాంతి పూజలు నిర్వహించినట్లు, అనంతరం కూలీలకు మందు , విందు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
‘మీకు తోచింది రాసుకోండి’ అన్నారనే ఆరోపణ
ఈ ఘటనలపై వివరణ కోరేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, “ఇలాంటి విషయాలు సర్వసాధారణం. మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి. మాకు ఏమీ కాదు. వార్తలు రాస్తే మేము భయపడాలా? పనులు ఆపుకోవాలా?” అంటూ నిర్లక్ష్య ధోరణితో సమాధానం ఇచ్చారని వార్తా ప్రతినిధికి సమాచారం అందింది. ఈ వ్యాఖ్యలు నిజమైతే కార్మికుల భద్రత పట్ల సంస్థ వైఖరిపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్మిక సంఘాల మౌనంపై విమర్శలు
రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక సంఘాలు స్పందించడం లేదని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నా, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నా సంఘాలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు.
అధికారులు స్పందించాలంటున్న ప్రజలు
రోజువారీ కూలీలకు కనీస భద్రత, వైద్య సదుపాయాలు, నివాసం, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం, సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిర్మాణ పనుల వద్ద భద్రతా ప్రమాణాలను పరిశీలించి, లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా కార్మికుల ఆరోపణలపై సంబంధిత సంస్థ యాజమాన్యం కూడా పూర్తి వివరాలతో స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులు ఎంత వేగంగా సాగినా, వాటిని నిర్మించే కార్మికుల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



