- కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు.. పాలమూరు అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా:
జడ్చర్లలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పాలమూరు జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్షాలపై విమర్శలు తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. తన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం, పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తాను పాలమూరు బిడ్డనని పేర్కొన్న రేవంత్ రెడ్డి, గత రెండు రోజులుగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించినట్లు తెలిపారు. వలసల బాధలు, రైతుల ఆత్మహత్యల విషాదాలు పాలమూరు ప్రజలకు ఎంతటి కష్టాలు తెచ్చాయో తనకు బాగా తెలుసని అన్నారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని గుర్తు చేస్తూ, “ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండకూడదనే భావనతో సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు” అని అన్నారు. అయితే తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన కేసీఆర్, రాష్ట్ర అభివృద్ధికి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు.
పాలమూరులో రాజకీయంగా ఎదిగి, తర్వాత గజ్వేల్‌కు వెళ్లి పోటీ చేసిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, కానీ ఆయన పదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్క ప్రధాన సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. రైతులకు సాగునీరు అందలేదని, ప్రజల కష్టాలు తీరలేదని విమర్శించారు.
ప్రస్తుతం కొందరు పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించిన సీఎం, “పాదయాత్రలు కాదు… కాశీ వరకు పోయి దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు పోవు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రజలు నిజానిజాలు గుర్తించే స్థాయికి వచ్చారని అన్నారు.

తాను రాజకీయ జీవితాన్ని జడ్పీటీసీగా ప్రారంభించానని గుర్తు చేసుకుంటూ, “మీరు నాటిన మొక్క ఇప్పుడు ముఖ్యమంత్రిగా వృక్షమై మీ ముందుకు వచ్చింది” అని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరులో గెలిచి గజ్వేల్‌కు వెళ్లిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా? లేక పాలమూరు కోసం పోరాడుతున్న నేను ద్రోహినా? అని ప్రశ్నించారు.
జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత 30 నెలల్లో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్, ఉద్దండపూర్ నిర్వాసితులకు రూ.800 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నిర్వాసితులను జైళ్లలో పెట్టి వేధించారని మండిపడ్డారు.
విద్యాభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొంటూ, కొడంగల్‌లో భారీ ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని తెలిపారు. “జైళ్లు కట్టాలని వారు అనుకుంటే, స్కూళ్లు కట్టాలని మేము అనుకున్నాం” అని వ్యాఖ్యానించారు. చదువు ద్వారానే జీవితాలు మారుతాయని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని సూచించారు.

పాలమూరు జిల్లాలో వలసలు ఆగాలంటే, రైతులు సంతోషంగా జీవించాలంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలని సీఎం స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రస్తావిస్తూ, జిల్లాలో ఇల్లు లేని గూడెం ఉండదని అన్నారు.
ప్రజలు రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, “పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు… మట్టితో కప్పడం కూడా తెలుసు” అంటూ హెచ్చరించారు. కేసీఆర్‌కు సవాల్ విసురుతూ, రాబోయే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామని ప్రకటించారు.
తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు అందించామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడించారు.
తమ రెండున్నరేళ్ల పాలనపై, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. “నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రా… చర్చిద్దాం. మా పాలన తప్పైతే నేను క్షమాపణ చెబుతాను” అంటూ సవాల్ విసిరారు.
గోదావరి జలాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు సహకరించడం లేదని ఆరోపించిన సీఎం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 90 టీఎంసీల నీటిని సాధించడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
రాబోయే రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన సీఎం, 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని ప్రకటించారు.
చివరగా “ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. సభలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



