- అధికారులు – కాంట్రాక్టర్లు కుమ్మక్కు..?
- పనులు గాలికి వదిలేసిన ఎస్వీకే సంస్థపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
- విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
- సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
కొడంగల్ మున్సిపల్ అభివృద్ధి పనుల్లో తీవ్ర అవ్యవస్థ నెలకొన్నదని, అధికారులు – కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మున్సిపల్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించినప్పటికీ, స్థానిక స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా పనులు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు.
బుధవారం కడ ప్రత్యేక అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా మాట్లాడుతూ కొడంగల్ మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో SVK సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా సాగుతున్నాయని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డంపింగ్ యార్డ్ నిర్మాణం వంటి కీలక పనులు నెలల తరబడి నిలిచిపోయాయని తెలిపారు. ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ మాత్రం పనులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

“కొడంగల్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కానీ ఇక్కడి అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ఆ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ కాలం గడుపుతున్నారు” అని మండిపడ్డారు.
వైస్ చైర్మన్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ పెద్ద చెరువు కట్ట నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, డంపింగ్ యార్డ్ నిర్మాణం కూడా జాప్యానికి గురవుతోందని ఆరోపించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పాత కొడంగల్ గ్రామంలో రోడ్లు దారుణంగా మారి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కొడంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. “అభివృద్ధి పనుల కోసం భారీ నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై కూడా ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని, కొందరు అధికారులు ప్రజాప్రతినిధులతో అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. “మా ఇష్టం వచ్చినప్పుడు పనులు చేస్తాం… ఎవరికైనా చెప్పుకోండి” అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వందసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఇలా ఉంటే ప్రజలకు ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని ప్రజాప్రతినిధులు వాపోయారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజాప్రతినిధులు తలవంచుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమావేశానికి ఆలస్యంగా వచ్చిన SVK సంస్థ ప్రతినిధులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద 10 బృందాలు పనిచేస్తున్నాయని, ఒక్కో బృందంలో ఎనిమిది మంది లేబర్లు ఉన్నారని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు.
అయితే మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గుప్తా ఈ వాదనలను ఖండిస్తూ “కొడంగల్లో ఎక్కడా 10 బృందాలు పనిచేయడం లేదు. ఒకరు ఇద్దరు కార్మికులను చూపించి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని మండిపడ్డారు.
SVK సంస్థ పనితీరుపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా సీఎంకు నివేదిక అందజేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులు చేయకుండా విద్యుత్ శాఖ అధికారులపై సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు మానుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు.
కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా విస్తరణ పనుల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “రోడ్డు విస్తరణ పూర్తికాకముందే డివైడర్లు వేసి మొక్కలు నాటితే సరిపోతుందా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు.

రోడ్డు విస్తరణ పనుల్లో కూడా స్పష్టత లేకుండా ఒకచోట ఒక రీతిగా, మరోచోట మరో రీతిగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. పట్టణంలో వెడల్పుతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలులో మాత్రం గందరగోళం నెలకొన్నదని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొడంగల్ అభివృద్ధి పనుల్లో నెలకొన్న ఈ పరిస్థితులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం భారీ నిధులు కేటాయించినప్పటికీ పనులు పూర్తికాకపోవడం, అధికారులు – కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




