భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం చేతకానితనానికి నిదర్శనం

  • ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి నిధుల కొరత ఉండదు..
  • కేంద్రం సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి
  • పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల అప్రోచ్‌తో పనులు చేపట్టాలి..
  • కొడంగల్ ప్రెస్‌మీట్‌లో ఎంపీ డీకే అరుణ డిమాండ్

శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, అక్టోబర్ 31:

భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని, కేంద్రం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటే తెలంగాణలో అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.కొడంగల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఓటు చోరీ ఆరోపణలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కొడంగల్ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిధులు, హైదరాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్ర తదితర అంశాలపై మాట్లాడారు.

కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

దేశంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. నిజంగా ఓటు చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దడం ఎన్నికల నిర్వహణలో భాగమని పేర్కొన్నారు.డబుల్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న ఓట్లు ఓటర్ల జాబితాలో కొనసాగించాలా అని ఆమె ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల వ్యవస్థ లక్ష్యమని అన్నారు. ఓటర్ల జాబితా సవరణను తప్పుగా చిత్రీకరించి ప్రజలను గందరగోళానికి గురిచేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని విమర్శించారు.దేశంలో విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని డీకే అరుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశంలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ ఐక్యతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

కొడంగల్ మాత్రమే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలి

కొడంగల్ నియోజకవర్గం మాత్రమే కాకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. పాలమూరు ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.కొడంగల్‌కు స్థానికుడు కాకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మి గెలిపించారని ఆమె గుర్తుచేశారు. ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కొడంగల్ పట్టణంలో రోడ్ల విస్తరణ చేపడుతున్నప్పటికీ, ఆ ప్రక్రియలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు సరైన పరిహారం అందడం లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని, బాధితుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు నష్టం కలిగించకుండా, వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేంద్ర నిధులతో కొడంగల్‌లో అభివృద్ధి పనులు

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆమె ఈ సందర్భంగా వివరించారు.అమృత్ పథకం కింద కొడంగల్ నియోజకవర్గానికి రూ.2.22 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.45 కోట్లతో రోడ్లు, కమ్యూనిటీ హాల్, హైమాస్ట్ లైట్ల వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.పీఎం శ్రీ పథకం కింద రూ.79.50 లక్షలతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రూ.69.75 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.అదేవిధంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు అందించేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల అప్రోచ్‌తో పనులు చేపట్టాలి

పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పాలమూరు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి డీపీఆర్‌లో జూరాల నుంచి నీటి అప్రోచ్‌ను ప్రతిపాదించారని, అయితే కేసీఆర్ ప్రభుత్వం ఆ అప్రోచ్‌ను నార్లాపూర్‌కు మార్చడం వల్ల పాలమూరు ప్రాంతానికి నష్టం జరిగిందని ఆమె విమర్శించారు.జూరాల నుంచి నీటి అప్రోచ్‌తో ప్రాజెక్టు పనులు చేపట్టాలని, మొదటి డీపీఆర్ ప్రకారం పనులను పూర్తి చేయాలని కోరారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు.ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే, జిల్లాకు అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల అప్రోచ్‌ను తీసుకొచ్చి, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం వద్దకు కలిసి వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కోరుదామని ఎంపీ డీకే అరుణ సూచించారు.పాలమూరు ప్రాంత అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులు అత్యంత కీలకమని, వాటిని రాజకీయాలకు అతీతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

KADA నిధులపై ఎంపీ విమర్శలు

కొడంగల్ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన KADAకు ప్రత్యేకంగా నిధులు రావడం లేదని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కొండారెడ్డిపల్లి నుంచి KADAకు నిధులు అందడం లేదని, దానికంటూ ప్రత్యేక నిధి కూడా లేదని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న నిధులను మళ్లించి KADAకు వినియోగిస్తున్నారని ఆమె విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకుండా, ఇతర పథకాల నిధులను మళ్లించడం సరైన విధానం కాదని అన్నారు.కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో చేపట్టే పనులకు పారదర్శకమైన ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో నవంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు.హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ప్రాంగణంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోహింజహి మార్కెట్ వరకు ఈ మహా పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు బీజేపీ ఈ మహా పాదయాత్ర చేపడుతోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.కొడంగల్‌లో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పూనం చంద్ లహటి, ప్రతాప్ రెడ్డి, బస్వరాజు, మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles