- మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్‌పై గ్రామస్తుల ఆరోపణలు
- చెరువు నుంచి నీటిని తోడుతున్నారంటూ విమర్శలు.. విచారణ చేపట్టాలని ప్రజల డిమాండ్
శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, అక్టోబర్ 16:
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గుండ్లకుంట గేటు నుంచి పెద్ద నందిగామ మీదుగా నందారం వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం జరుగుతోందని, ఈ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించే పనులను దక్కించుకున్న దివాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్, మొక్కల సంరక్షణను సక్రమంగా చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు, నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా నీరు అందించడం లేదని విమర్శిస్తున్నారు.
చెరువు నుంచి నీటి తరలింపు?
మొక్కలకు ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాల్సి ఉండగా, హుస్సేన్పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి బోరును లీజుకు తీసుకొని నీటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. అయితే, పెద్ద నందిగామ గ్రామ శివారులోని చెరువు నుంచి నీటిని తోడి మొక్కలకు తరలిస్తూ, మరోవైపు నీటి సరఫరా పేరుతో బిల్లులు పొందుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.
మీడియా కంటపడటంతో హడావుడి!
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో చెరువు నుంచి నీటిని తోడుతున్న ఘటన మీడియా దృష్టికి రావడంతో సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కాంట్రాక్టర్ ఇచ్చిన సమాధానాలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొక్కల సంరక్షణ పనులకు సంబంధించిన ఒప్పంద నిబంధనలు, నీటి సరఫరా వివరాలు, చెల్లించిన బిల్లులు, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


