శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 9
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చిట్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి పాఠశాల ఆవరణలో కొలువుదీర్చారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బనలక్ష్మి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే విశిష్టమైన పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు, వాటిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించినట్లు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటి పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
అనంతరం బతుకమ్మలను సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసి, విద్యార్థులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.


