- ఆంధ్ర నుంచి కొడంగల్‌కు అక్రమంగా ఇసుక తరలింపు..
- పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు
- లారీని స్వయంగా పోలీస్ స్టేషన్‌కు తరలించిన అసోసియేషన్ సభ్యులు
- రంగంలోకి దిగిన ఆర్టీవో, కేసు నమోదు చేసి భారీ జరిమానా విధింపు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూన్ 30:
కొడంగల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, డంపింగ్ యార్డుల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటూ గత కొంతకాలంగా పలు వార్తాపత్రికలు, మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై కొడంగల్ లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వారు స్వయంగా రంగంలోకి దిగిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు ప్రాంతం నుంచి AP 39 WE 1346 నంబర్ గల లారీలో దాదాపు 60 టన్నుల ఇసుకను అక్రమంగా కొడంగల్ పట్టణానికి తరలించినట్లు లారీ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందింది. అనంతరం వారు అప్రమత్తమై, కొడంగల్ పట్టణ పరిధిలోని ఓ డంపింగ్ యార్డు వద్ద ఇసుకను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో లారీని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా లారీకి సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలను పరిశీలించిన అసోసియేషన్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో మాత్రమే అనుమతులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుక రవాణాకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు లేవని గుర్తించినట్లు పేర్కొన్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించినప్పటికీ, పోలీసులు స్పందించలేదని, అక్రమ ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు.
పోలీసులు స్పందించకపోవడంతో, పరిస్థితిని గమనించిన కొడంగల్ లారీ అసోసియేషన్ సభ్యులు స్వయంగా ఆ లారీని అదుపులోకి తీసుకుని కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మంగళవారం ఉదయం స్థానిక ఎస్ఐ లారీని పరిశీలించిన అనంతరం, సంబంధిత వాహనానికి అక్కడి నుంచి కొడంగల్ వరకు అనుమతులు ఉన్నాయని భావించి లారీని విడుదల చేయాలని సిబ్బందికి సూచించినట్లు సమాచారం. అయితే, లారీ అసోసియేషన్ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధమైన అనుమతులు లేవని వారు వాదిస్తూ పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించారు.
ఈ క్రమంలో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆర్టీవో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి లారీపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా, సుమారు రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు లారీని సీజ్ చేసినట్లు తెలిసింది.

ఈ విషయంపై స్థానిక పోలీసు అధికారులను వివరణ కోరగా, ఆర్టీవో అధికారులు విచారణ జరిపి కేసు నమోదు చేశారని, సంబంధిత లారీపై లక్ష రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, కొడంగల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా, డంపింగ్ యార్డుల నిర్వహణ, కోట్ల రూపాయల వ్యాపారంపై పోలీసుల వ్యవహార శైలిపై స్థానిక ప్రజలు, లారీ యజమానులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులకు కొంతమంది అధికారులు, పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా వ్యవహారంపై జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాపై లారీ అసోసియేషన్ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం, అనంతరం ఆర్టీవో శాఖ జోక్యం చేసుకుని కేసు నమోదు చేయడం కొడంగల్ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



