శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 9 :
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ చేరి ఆటపాటలు, కోలాట నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినులు తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు తిరుపతయ్య, వేణుగోపాల్, శశికుమార్, పీఈటీ శ్రీనివాస్, విద్యాభిమాని సీ. సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సైతం వేడుకల్లో పాల్గొని విద్యార్థినులను అభినందించారు.
పాఠశాలల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందుతుందని పలువురు పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణాలు బతుకమ్మ పాటలతో, విద్యార్థినుల సందడితో పండుగ శోభను సంతరించుకున్నాయి.


