- ‘ఎల్ నినో’ ప్రభావంతోనే నీటి, విద్యుత్ కొరత
- బీఆర్ఎస్ నేతలకు కనీస విజ్ఞత, బాధ్యత లేదు
- అందుకే నేను నోరు జారాల్సి ఉంటుంది
- రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 24 :
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల సంభవించిన సహజసిద్ధమైన కరువు పరిస్థితులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించి చిల్లర రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతల దివాళాకోరుతనానికి నిదర్శనమని గతంలో కూడా వీరి వికృత చేష్టలు చూసి నోరు జారాల్సి వచ్చిందని కనీస ప్రతిపక్ష బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా మాట్లాడుతున్నారని షాద్‌నగర్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువును అడ్డం పెట్టుకుని తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురాశతో ప్రజలను, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ సమగ్రంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ప్రధానాంశాలుఇలా ఉన్నాయి.
ప్రకృతి విపత్తుపై అబద్ధాల ప్రచారం
“ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటి, రాష్ట్రవ్యాప్తంగా 50 శాతానికి పైగా బోర్ బావులు ఎండిపోయాయి. ఇది ప్రకృతి విపత్తు. గతంలో ఇలాంటి కరువులు వచ్చినప్పుడు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. కానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ముందస్తుగా హెచ్చరికలు చేసి, కరువును తట్టుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అలాంటిది, ‘కాంగ్రెస్సే కరువును తెచ్చింది’ అని బాధ్యతారహితంగా మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకులకు సిగ్గు, శరం ఉండాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వేళ ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్
గత విపత్తులను గుర్తుచేస్తూ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు: “2019-20లో కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు దేశమంతా ఏకతాటిపై నిలబడింది. ఆనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షాన సీతక్క కరోనా ప్రమాదంపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే, కేసీఆర్ ఎగతాళిగా మాట్లాడారు. ‘ఎండ తీవ్రతకు కరోనా మసైపోతుంది, కాంగ్రెస్ నేతలు పారాసిటమాల్ వేసుకుని మాస్కులు పెట్టుకోవాలి’ అంటూ గేలి చేశారు. తీరా కరోనా విజృంభించాక కేసీఆర్ ఫామ్‌హౌస్ దాటి బయటకు రాలేదు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు” అని గుర్తుచేశారు.
రికార్డు స్థాయి విద్యుత్ అందించి పంటలను కాపాడాం
“బోర్లు ఎండిపోయి, సాగునీటి కొరత ఏర్పడినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్కడా వెనకాడలేదు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్ల నుంచి ఏకంగా 20,000 మెగావాట్లకు చేరింది. ఎంత ఖర్చయినా వెనకాడకుండా బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి, రైతులకు అదనంగా కరెంట్ సరఫరా చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉంటూ చివరి దశలో ఉన్న పంటలను కాపాడారు” అని స్పష్టం చేశారు.
రైతులకు మేలు చేసే విధానాలు
ప్రభుత్వం సూచించిన నిర్దిష్టమైన మేలైన వరి రకాలను సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచి ధర లభిస్తోందని, వ్యాపారులే నేరుగా కళ్ళాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల పొట్ట కొట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలబడి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తూ అండగా ఉంటోందని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పాత్ర పోషించండి
విపత్తుల వేళ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడకుండా, ప్రతిపక్ష హోదాలో ప్రజలకు ధైర్యం చెప్పాలని, అవసరమైతే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే హితవు పలికారు. వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ ప్రజాస్వామ్య మూలస్తంభంగా నిలుస్తున్న మీడియాకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునాయక్ పురుషోత్తం రెడ్డి బాలరాజ్ గౌడ్ ఇబ్రహీం చందు నాయక్ రాయికల్ శ్రీనివాస్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ బాదేపల్లి సిద్ధార్థ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్ పెంటయ్య డిప్యూటీ సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు..


