- అధికారులకు రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు సూచన
శ్రీ బల భీమ న్యూస్ /దగదర్తి, అక్టోబర్ 20
స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల విధులు కేటాయించిన ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.హెచ్. నాగరాజు సూచించారు.
మంగళవారం దగదర్తి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు నియమితులైన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మండలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో భాగంగా జోనల్ టీమ్లు, రూట్ అధికారులు, ఎంసీసీ టీమ్ సభ్యులు, మండల శిక్షకులు, పంచాయతీ కార్యదర్శులు తమకు కేటాయించిన బాధ్యతలను ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సి.హెచ్. శ్రీదేవి, తహసీల్దార్ లాజరస్, ఎస్ఐ మహేంద్ర, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



