నాతో పెట్టుకోవద్దు.. ఆధారాలతోనే మాట్లాడుతున్నా”

  • బీఆర్ఎస్ అధినేత నిర్ణయాన్నే వ్యతిరేకించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా?
  • “అహంకారం.. అక్రమ దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరే”
  • కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ సెప్టెంబర్ 29 :

తాను ఏ అంశంపైనైనా నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ.. ఎవరైనా చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి మాట్లాడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ‘ఎక్స్’ వేదికగా ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత స్పందించారు. పార్టీ అధినేత నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నించడం, వ్యతిరేకించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని ఆమె ప్రశ్నించారు.

“పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరే”

అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన అనుమతులు, ఇతరులకు చేసిన ప్రయోజనాలు, క్విడ్‌ప్రోకో వ్యవహారాలతో పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరేనని కవిత ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై వైఫల్యాలను మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

“కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు.. పార్టీలో మీ వైఫల్యాలను, చేతకానితనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో దీనివల్ల అర్థమవుతోంది” అని కవిత వ్యాఖ్యానించారు.

“నన్ను సస్పెండ్ చేశారు.. మరి ఇదే పార్టీ వ్యతిరేక చర్య కాదా?”

బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో తాను ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విమర్శించినందుకు కొన్ని గంటల్లోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కవిత పేర్కొన్నారు. అదే వ్యక్తితో కలిసి ఉండే వారు పార్టీ అధినేత నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నించడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? అని నిలదీశారు.

కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యల ప్రస్తావన

గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను సంప్రదించి పాటలు ప్లే చేయించుకున్నారనే అంశాన్ని కూడా కవిత ప్రస్తావించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఓ రైతు ఫోన్‌లో మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

గతంలో సాయం కోసం వచ్చిన ఓ మహిళతో కేటీఆర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను కూడా కవిత గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు అహంకారాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆమె విమర్శించారు.

“మైండ్‌గేమ్‌ను నమ్మి పార్టీకి గోతులు తవ్వొద్దు”

ఒక వ్యక్తి చేస్తున్న రాజకీయ మైండ్‌గేమ్‌ను గుడ్డిగా నమ్మి పార్టీ అధినేతను తప్పుపట్టడం ద్వారా బీఆర్ఎస్‌కు నష్టం చేస్తున్నారని కవిత హెచ్చరించారు.

తాను మాట్లాడే ప్రతి అంశానికీ ఆధారాలు ఉన్నాయని, తనను తేలికగా తీసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles