- సంక్షేమం నుంచి ప్రపంచస్థాయి తెలంగాణ వైపు అడుగులు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ఆగస్టు 30 :
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, సామాజిక న్యాయం, పెట్టుబడులు, ఉపాధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు తదితర రంగాల్లో సాధించిన పురోగతిని ప్రభుత్వం వివరించింది. ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లామని ప్రభుత్వం పేర్కొంది.
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా పలు పథకాలను అమలు చేయడంతో పాటు కొత్త చట్టాలు, విధానాలు, సంస్థలు, పరిపాలనా సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, విద్య నుంచి వైద్యం వరకు, మహిళా సాధికారత నుంచి యువత ఉపాధి వరకు, సామాజిక న్యాయం నుంచి డిజిటల్ పాలన వరకు అనేక రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం అధికమని పేర్కొంది.
రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి ఉపశమనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఒకే విడతలో తొమ్మిది రోజుల్లో దాదాపు రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది.
సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అమలు చేయడంతో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పంట నష్టపరిహారం వంటి చర్యల ద్వారా రైతులకు భరోసా కల్పించినట్లు పేర్కొంది. 32 నెలల లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1.68 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ దేశంలో నంబర్–1గా నిలిచిందని ప్రభుత్వం పేర్కొంది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 13.37 లక్షల మంది రైతులకు రూ.18,929 కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపింది. రెండు సీజన్లలో 1.47 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్లను చెల్లించినట్లు వివరించింది.
తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తరించే దిశగా ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదిరిందని ప్రభుత్వం వెల్లడించింది.
గిరిజన రైతులకు సాగునీటి భరోసా
ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమం ద్వారా 2.10 లక్షల గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తూ 6 లక్షల ఎకరాల పోడు భూములకు సాగునీరు అందించేందుకు రూ.12,600 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మహిళా సాధికారతకు మహాలక్ష్మి
మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా మరింత భరోసా కల్పించే దిశగా మహాలక్ష్మి పథకం అమలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు జరిగాయని, తద్వారా మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అయినట్లు పేర్కొంది.
గృహజ్యోతి పథకం కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించి 10 కోట్లకుపైగా జీరో బిల్లులు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందించినట్లు తెలిపింది.
కల్యాణలక్ష్మి ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా విస్తృతంగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 4.54 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజీతో పాటు రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించినట్లు వివరించింది.
మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ, పెట్రోలు బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి కొత్త ఆదాయ వనరులను కల్పించే చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆహార భద్రతకు విస్తృత చర్యలు
రాష్ట్రంలో 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, కొత్త కార్డులు, సభ్యుల చేరికల ద్వారా లక్షలాది మందిని అదనంగా ఆహార భద్రత పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దాదాపు 3.38 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొంది.
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంతింటి కల
పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో అర్హ కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక భద్రతలో భాగంగా 43.01 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, 2023 డిసెంబర్ నుంచి 2026 జూలై వరకు రూ.30,089 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సామాజిక భద్రత పరిధిని మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్లకుపైగా కుటుంబాలను కవర్ చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సర్వే ఆధారంగా వివిధ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను వెల్లడించినట్లు పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, ఈ వర్గీకరణను అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వం తెలిపింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినట్లు వెల్లడించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర మొత్తం వ్యయంలో 12.4 శాతం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కార్మికుల హక్కులకు బలం
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ చేపట్టి దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.16 వేలు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేలు, స్కిల్డ్ కార్మికులకు రూ.18,500, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.20 వేల కనీస నెలవారీ వేతనాన్ని నిర్ణయించినట్లు తెలిపింది.
గిగ్ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురికాకుండా కుటుంబ బాధ్యతను బలోపేతం చేసే ప్రత్యేక చట్టానికి కూడా శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల తెలంగాణ బిల్లుకు రూపకల్పన చేసినట్లు పేర్కొంది.
విద్యారంగంలో కొత్త మార్పులు
విద్యారంగంలోనూ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపింది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి సాధించినట్లు పేర్కొంది.
ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంతో 105 పాఠశాలలను మంజూరు చేసి, వాటిలో 84 పాఠశాలలకు అనుమతులు ఇచ్చి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ద్వారా ప్రభుత్వ విద్యకు కొత్త నమూనాను రూపొందించినట్లు పేర్కొంది.
ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం అందించేందుకు రూ.720 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేసినట్లు పేర్కొంది.
సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 212 శాతం పెంచినట్లు తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించింది. దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను యాజమాన్యాల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది.
యువతకు ఉద్యోగాలు.. నైపుణ్యాభివృద్ధి
ప్రజా ప్రభుత్వం హయాంలో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, డీఎస్సీ సహా కీలక నియామక ప్రక్రియలను పూర్తి చేసినట్లు పేర్కొంది.
టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీలో 1,190 మంది అధునాతన నైపుణ్య శిక్షణ పూర్తి చేయగా, 838 మందికి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభించినట్లు ప్రభుత్వం తెలిపింది.
65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దినట్లు పేర్కొంది. టీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, వీ-హబ్ ద్వారా 90 వేలకుపైగా యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు తెలిపింది.
వైద్యరంగంలో విస్తరణ
ఆరోగ్య రంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గోషామహల్లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
సనత్‌నగర్‌లో టిమ్స్ ప్రారంభించడంతో పాటు అల్వాల్, ఎల్బీనగర్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడంతో పాటు మరో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించింది.
నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్నట్లు, దాదాపు 1,900 మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వైద్యరంగంలో దక్షిణ భారతదేశంలో తొలి రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్‌ను నిమ్స్‌లో నిర్వహించినట్లు పేర్కొంది.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సహాయం అందించినట్లు తెలిపింది. సీఎంఆర్ఎఫ్ వైద్య రీయింబర్స్మెంట్ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్ల సహాయం, 39,712 మందికి రూ.798.41 కోట్ల విలువైన ఎల్ఓసీలు అందించినట్లు వెల్లడించింది.
కల్తీ, డ్రగ్స్‌పై కఠిన చర్యలు
ఆహార కల్తీ, డ్రగ్స్ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు టీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకొచ్చి విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించేలా టీ సేఫ్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించినట్లు పేర్కొంది.
టీ సేఫ్‌లో ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసి కల్తీదారులు, డ్రగ్స్ నేరస్థులపై కఠిన చర్యలకు సమగ్ర వ్యవస్థను రూపొందించినట్లు తెలిపింది.
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్ నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీలను తప్పనిసరి చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు
విద్యాసంస్థల్లో క్యాంపస్ కోఆర్డినేటర్లు, స్పాటర్లను నియమించి విద్యార్థుల్లో ప్రవర్తనా మార్పులను ముందుగానే గుర్తించే విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. డ్రగ్స్ నియంత్రణలో బాధ్యత వహించని విద్యాసంస్థల గుర్తింపుపై చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీసింగ్, 1930 స్పందన వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలిపింది. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల ద్వారా మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
భూ పరిపాలనలో సంస్కరణలు
భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. భూధార్ ద్వారా భూములకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు ఏఐ ఆధారిత భూమిత్ర సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది.
3.76 లక్షల కొత్త పట్టాదార్ పాస్‌బుక్స్ జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజల వద్దకే పాలన
ప్రజాపాలన–అభయహస్తం కార్యక్రమం ద్వారా గ్రామాలు, వార్డుల్లోనే ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758 గ్రామసభలు, 3,175 వార్డుసభలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో 1,06,598 పెండింగ్ ప్రభుత్వ ఫైళ్లను పరిష్కరించినట్లు తెలిపింది. 76 వేలకుపైగా రైతులను సూక్ష్మ సాగునీటి పరిధిలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి అనంతరం అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణిని విస్తరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులందరినీ ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉంచే విధానాన్ని అమలు చేసినట్లు తెలిపింది.
రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, ప్రజావాణి అర్జీల పరిష్కార పురోగతిని ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించేలా ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం
ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల్లో వంద రోజుల్లో రూ.6,000 కోట్లను చెల్లించినట్లు పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ద్వారా క్యాష్‌లెస్ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్ అమలు చేయడంతో పాటు దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్ కేబినెట్ నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాట్సాప్ ద్వారా 581కిపైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.
ఏఐ, డిజిటల్ తెలంగాణకు బాటలు
దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్–టీజీడెక్స్ను ఏర్పాటు చేసి 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
టీ-ఫైబర్ ద్వారా భారత్‌నెట్ రెండో దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ కల్పించే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు విజిలెన్స్, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
పౌరసరఫరాలు, మైన్స్ అండ్ మినరల్స్, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు, ఎగవేతలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మౌలిక వసతుల విస్తరణ
హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది. హైదరాబాద్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణ, మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ, ఆదిలాబాద్‌లో జాయింట్ యూజ్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
చెరువుల పరిరక్షణ.. మూసీ పునరుజ్జీవనం
హైడ్రా ద్వారా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. 1,045 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించినట్లు పేర్కొంది.
బతుకమ్మకుంట, నల్లచెరువు సహా పలు చెరువుల పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపింది. మూసీ పునరుజ్జీవనానికి 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, మూసీ పరిధిలో 39 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళికను కూడా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
పారిశ్రామిక రంగానికి భారీ పెట్టుబడులు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ–2025 ద్వారా పాత పారిశ్రామిక ప్రాంతాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్–2024లో కీలక విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలిచిందని తెలిపింది.
టీజీ–ఐపాస్ ద్వారా 26,608 యూనిట్లకు రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదాలు ఇచ్చినట్లు వెల్లడించింది. టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు రావడంతో 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడిందని తెలిపింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో 100 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్‌లో సాఫ్రాన్–సీఎఫ్ఎం విమాన ఇంజిన్ నిర్వహణ, మరమ్మతు కేంద్రానికి మార్గం సుగమం చేసినట్లు తెలిపింది.
లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలకు ప్రాధాన్యం
నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ–2026-30ను తీసుకొచ్చి రూ.73,360 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించడంతో పాటు రూ.2,060 కోట్ల యూనిటీ మాల్, రూ.2,049 కోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి ప్రణాళికలను చేపట్టినట్లు తెలిపింది.
2026-27లో ఇప్పటివరకు రూ.12,350 కోట్ల ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఫోటానిక్స్ వ్యాలీలో రూ.5,500 కోట్ల పెట్టుబడి పైప్‌లైన్ ఉందని తెలిపింది.
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది
2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాల సంఖ్య 12.14 లక్షలకు చేరిందని ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్‌లో 355కుపైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు ఉన్నాయని, 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని పేర్కొంది. డేటా సెంటర్లు, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన కేంద్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని తెలిపింది.
అమెజాన్ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి ప్రాంతాల్లో భారీ హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
పర్యాటక రంగంలో కొత్త విధానం
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సమగ్ర టూరిజం పాలసీ–2025ను అమలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యానికి మించి తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడి పైప్‌లైన్ ఏర్పడిందని, 42 అవగాహన ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది.
యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో దేశంలో నంబర్–1గా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2025-26లో రూ.101.93 కోట్ల ఆదాయం, రూ.13.35 కోట్ల నికర లాభం సాధించినట్లు వెల్లడించింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డులో దేశంలో మొదటి స్థానం సాధించి రూ.1 కోటి పురస్కారం పొందినట్లు ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ సంస్కృతి, ఉద్యమ వారసత్వానికి గౌరవం
‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక గౌరవం కల్పించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి, వారి కుటుంబాలకు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
2047 లక్ష్యంతో తెలంగాణ రైజింగ్
తెలంగాణను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ‘తెలంగాణ రైజింగ్–2047’కు ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు వెల్లడించింది.
2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొంది.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం క్యూర్–కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్–పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రేర్–రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ అనే మూడు అభివృద్ధి వలయాలతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్–జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, డేటా సెంటర్లు, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.
మొత్తంగా వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, డిజిటల్ పాలన, ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్ తెలంగాణను మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా, పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


