మహాత్మా మన్నించు..!

  • మొగలిగిద్దలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల చెక్కుల కోసం లంచం డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు
  • రూ.2.88 కోట్ల చెక్కుల విడుదలకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారన్న కాంట్రాక్టర్‌
  • ఇప్పటికే రూ.4 లక్షలు చెల్లించానని బాధితుడి ఫిర్యాదు
  • మరో రూ.43 లక్షల చెక్కు కోసం రూ.6 లక్షలు అడిగారన్న ఆరోపణ
  • ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు.. కలెక్టర్‌, డీపీఓకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

శ్రీ బల భీమ న్యూస్ / మొగిలిగిద్ద (ఆగస్టు 14) :

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు సంబంధించిన చెక్కుల విడుదల కోసం గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు లంచం డిమాండ్‌ చేశారంటూ ఓ కాంట్రాక్టర్‌ చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపుతోంది.

ఫరూక్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో గ్రామ పాఠశాల శతవసంత కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.5 కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద నిధులు మంజూరైనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పనులను చేపట్టేందుకు కొత్తూరు మండలం జహంగీర్‌పీర్‌ దర్గా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌ ఖాజాపాషా ముందుకు వచ్చారు.

కాంట్రాక్టర్‌ వాదన ప్రకారం.. గ్రామంలో సుమారు రూ.4 కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులను పూర్తి చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల కోసం చాలాకాలంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చెక్కుల విడుదలకు గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ భర్త, ఓ వార్డు సభ్యుడు తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.

చెక్కు విడుదలకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణ

కాంట్రాక్టర్‌ ఖాజాపాషా చేసిన ఫిర్యాదు ప్రకారం.. మొదటి విడతలో సుమారు రూ.2.88 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులు విడుదల చేయడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ సర్పంచ్‌ బుగ్గ కృష్ణ, ఉపసర్పంచ్‌ లక్ష్మీ భర్త రాము, వార్డు సభ్యుడు మహమ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ కలిసి డిమాండ్‌ చేశారని ఆరోపించారు.

తాను పనుల కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టానని, బిల్లులు విడుదల కాకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంట్రాక్టర్‌ పేర్కొన్నారు. చెక్కులు అందకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డిమాండ్‌ చేసిన మొత్తంలో భాగంగా రూ.4 లక్షలను వార్డు సభ్యుడు మహమ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాతాలో జమ చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ తర్వాతే మొదటి విడతకు సంబంధించిన రూ.2.88 కోట్లకు పైగా విలువైన చెక్కులు అందాయని కాంట్రాక్టర్‌ ఆరోపించారు.

రెండో విడతలో మరో రూ.43 లక్షలు

మొదటి విడత చెక్కులు అందిన అనంతరం మిగిలిన పనులు కొనసాగించినట్లు కాంట్రాక్టర్‌ తెలిపారు. ఈ క్రమంలో రెండో విడతగా సుమారు రూ.43 లక్షల నిధులు విడుదలయ్యాయని, వాటికి సంబంధించిన చెక్కులు తీసుకునేందుకు గ్రామపంచాయతీకి వెళ్లగా మరోసారి డబ్బుల కోసం డిమాండ్‌ చేశారని ఆరోపించారు.

మిగిలిన రూ.6 లక్షలు చెల్లిస్తేనే రూ.43 లక్షల చెక్కు ఇస్తామని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ భర్త, వార్డు సభ్యుడు చెప్పారని బాధితుడు ఆరోపించారు. చెక్కు కోసం పలుమార్లు గ్రామపంచాయతీ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆయన పేర్కొన్నారు.

గంటల తరబడి పంచాయతీలో కూర్చోబెట్టారన్న ఆరోపణ

శుక్రవారం చెక్కులు ఇస్తామని పిలిపించినప్పటికీ, డబ్బులు అందలేదన్న కారణంతో తమను గంటల తరబడి గ్రామపంచాయతీలో కూర్చోబెట్టారని కాంట్రాక్టర్‌ ఆరోపించారు. చెక్కులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటి విడుదలకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శి సైతం చెక్కుల విషయంలో ఇబ్బందులు కల్పించవద్దని చెప్పినప్పటికీ సంబంధిత వ్యక్తులు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

దీంతో విసిగి వేసారిన కాంట్రాక్టర్‌ ఖాజాపాషా ఫరూక్‌నగర్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీకాంత్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఎంపీడీవోకు ఫిర్యాదు.. కలెక్టర్‌, డీపీఓకు కూడా

మొగిలిగిద్ద గ్రామంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంట్రాక్టర్‌ కోరినట్లు తెలుస్తోంది. తాను చెల్లించినట్లు ఆరోపిస్తున్న రూ.4 లక్షల లావాదేవీతో పాటు చెక్కుల విడుదల కోసం మరో రూ.6 లక్షలు డిమాండ్‌ చేసిన విషయాన్ని కూడా విచారణలో పరిశీలించాలని ఆయన కోరినట్లు సమాచారం.

ఈ ఫిర్యాదు ప్రతులను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)లకు కూడా అందజేయనున్నట్లు బాధితుడు వెల్లడించారు.

గతంలో ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడి

ఇదే అంశాన్ని గతంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కాంట్రాక్టర్‌ వర్గాలు చెబుతున్నాయి. సమస్యను పరిష్కరించి కాంట్రాక్టర్‌కు రావాల్సిన చెక్కులు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్యే ఆదేశించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినప్పుడు వాటిని పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీపై ఉంటుందని, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తే ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యానికే విఘాతం కలుగుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

‘కోట్ల రూపాయల పనులు చేసి బిల్లుల కోసం తిరగాలా?’’

కాంట్రాక్టర్‌ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత బిల్లుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒకవైపు పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత, మరోవైపు బిల్లులు విడుదల కాకపోవడం, అదనంగా చెక్కుల కోసం డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయని తెలిపారు.

ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆరోపణలు వస్తే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు.

‘‘ముఖ్యమంత్రి మంజూరు చేసిన రోడ్లకే లంచం డిమాండ్‌?’’

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులకే లంచం డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులు ప్రజల కోసం వినియోగించాల్సి ఉండగా, వాటి విడుదలకు సంబంధించి వ్యక్తిగతంగా డబ్బులు డిమాండ్‌ చేశారనే ఆరోపణలు నిజమైతే ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని స్థానికులు అంటున్నారు.

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న సమయంలో వాటి అమలులో పారదర్శకత ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

కలెక్టర్‌ గారు.. జర చూడండి!

మొగిలిగిద్దలో వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు. రూ.4 లక్షలు చెల్లించినట్లు కాంట్రాక్టర్‌ పేర్కొంటున్న లావాదేవీ, చెక్కుల విడుదల కోసం మరో రూ.6 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు, పంచాయతీ కార్యదర్శి పాత్ర, చెక్కుల విడుదల ప్రక్రియ తదితర అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు చెబుతున్నారు.

ఆరోపణలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ భర్త, వార్డు సభ్యుల వాదన కూడా అధికారిక విచారణలో నమోదు చేసి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అవినీతి ఆరోపణలపై అధికారిక విచారణే కీలకం

గ్రామపంచాయతీ స్థాయిలో ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదని, ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి ప్రజాప్రయోజన పథకంలో పారదర్శకత అత్యంత కీలకమని పలువురు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్‌ చేసిన ఫిర్యాదుపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తేల్చాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రజలకు ఉపయోగపడాలన్నదే లక్ష్యం. అయితే బిల్లుల చెల్లింపుల విషయంలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు నిజమైతే అది కేవలం ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన సమస్య కాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం చూపే అంశంగా మారుతుంది.

అందుకే మొగిలిగిద్ద వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles