**పెండింగ్‌లో ఆరు డీఏలు.. ఉద్యోగుల్లో ఆగ్రహం..!

  • ఇచ్చింది మూడు.. బకాయిపడ్డది ఆరు..!
  • ఏడాదికి ఒక డీఏ ఇచ్చినట్టేనా..?
  • ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడ..?
  • ప్రశ్నిస్తున్న ఉద్యోగులు**

శ్రీ బల భీమ న్యూస్ /వికారాబాద్ , జూన్ 30:

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన కరువుభత్యం (డీఏ) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం విధిగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రకటించాల్సిన డీఏలు వరుసగా పెండింగ్‌లో పడుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జూలై 1న ప్రకటించాల్సిన డీఏను కలుపుకుంటే మొత్తం ఆరు డీఏలు ప్రభుత్వం బకాయిగా ఉంచినట్లవుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చరిత్రలోనే ఒకేసారి ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో డీఏలు పెండింగ్‌లో లేవని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో సైతం ఒకటి లేదా రెండు డీఏలకు మించి బకాయిలు లేవని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక డీఏలు పెండింగ్‌లో ఉంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం విచారకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ ఇవ్వాల్సిందే..!

కరువుభత్యం (డీఏ) అనేది పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చెల్లించే భత్యం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను ప్రకటిస్తూ వస్తోంది. అదే విధానాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం డీఏల విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగ సంఘాల నేతల ప్రకారం, ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో డీఏ ప్రకటించాల్సి ఉండగా, గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం కేవలం మూడు డీఏలను మాత్రమే విడుదల చేసింది. మిగిలిన ఆరు డీఏలను పెండింగ్‌లో ఉంచడం ఉద్యోగుల పట్ల అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు.

ఏడాదికి ఒక డీఏ ఇచ్చినట్టే పరిస్థితి..!

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే, ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ కాకుండా ఏడాదికి ఒక డీఏ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాల్లో కేవలం మూడు డీఏలను మాత్రమే ప్రకటించడం ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన మూడు డీఏల బకాయిలను కూడా విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. ముఖ్యంగా 2.5 లక్షలకు పైగా ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కొంతమేర చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

పెండింగ్ డీఏల విలువ రూ.10 వేల కోట్లకు పైగానే..!

ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం బకాయిగా ఉంచిన ఆరు డీఏల మొత్తం విలువ సుమారు 15 శాతం వరకు ఉంటుంది. ఒక శాతం డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఆరు డీఏలు, వాటి ఏరియర్స్ కలిపి మొత్తం భారం రూ.10 వేల కోట్లకు మించి ఉండొచ్చని చెబుతున్నారు.

ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పుకుంటూ ప్రభుత్వం డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ వంటి కీలక అంశాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై చర్చ వచ్చినప్పుడల్లా ఒకటో తేదీ జీతాల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతోందని వారు విమర్శిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలపై అసంతృప్తి

ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతున్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఏరియర్స్ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1.5 శాతం కోత

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలుకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రతి ఉద్యోగి మూల వేతనం లేదా ప్రతి పెన్షనర్ మూల పింఛనులో నుంచి నెలకు 1.5 శాతం మొత్తాన్ని హెల్త్ ఫండ్‌కు చందాగా మినహాయించాలని నిర్ణయించింది.

ఈ పథకాన్ని జూలై 15 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఇప్పటికే మే నెల జీతాలు, పెన్షన్ల నుంచే ఈ కోతలు ప్రారంభమైనట్లు వెల్లడైంది. ఉద్యోగుల నుంచి సుమారు రూ.528 కోట్లు, ప్రభుత్వ వాటాగా మరో రూ.528 కోట్లు కలిపి మొత్తం రూ.1,056 కోట్ల నిధులతో ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒక్కరికే కోత

ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమైన సందేహాలకు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా, లేదా ఒకరు ఉద్యోగి, మరొకరు పెన్షనర్ అయినా, వారిలో ఒక్కరి జీతం లేదా పెన్షన్ నుంచే 1.5 శాతం కోత విధిస్తామని స్పష్టం చేసింది.

అలాగే ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్‌తో పాటు కుటుంబ పెన్షన్ కూడా పొందుతున్న సందర్భాల్లో సైతం ఒకే ప్రీమియం కోత వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ప్రీమియం ముందే కట్.. తర్వాత జీవో..!

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. జూన్ 1న ఉద్యోగులకు చెల్లించిన మే నెల జీతాల్లోనే 1.5 శాతం ప్రీమియాన్ని ప్రభుత్వం కట్ చేసింది. అయితే ఆ సమయంలో సంబంధిత ట్రస్టు ఏర్పాటు, బ్యాంకు ఖాతా ప్రారంభం, అధికారిక ఉత్తర్వుల జారీ వంటి ప్రక్రియలు పూర్తికాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

నిబంధనల ప్రకారం ముందుగా ట్రస్టును ఏర్పాటు చేసి, దాని పేరిట ఖాతా తెరిచి, ఆ తర్వాతే ప్రీమియం కోతలకు అనుమతిస్తూ జీవో జారీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగుల జీతాల నుంచి కోతలు విధించిందని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం జూలై 1న చెల్లించే జూన్ నెల జీతాల్లో కూడా మరోసారి 1.5 శాతం ప్రీమియం కోత విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఆరోగ్య పథకం కోతలు, ఏరియర్స్ చెల్లింపుల అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles