- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో కొడంగల్‌కు కొత్త గుర్తింపు : సీఎం రేవంత్ రెడ్డి
- నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో కృష్ణా జలాలు తీసుకొస్తాం
- కొడంగల్‌ను ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం
శ్రీ బల భీమా న్యూస్ / కొడంగల్ :
కొడంగల్ : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా “పేదల తిరుపతి”గా ప్రసిద్ధి చెందిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. కొడంగల్ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, ఇప్పుడు అదే కొడంగల్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 2009లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు తమ చెమటను రక్తంగా మార్చి పనిచేశారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గం అంటే ఒకవైపు గుడి, మరోవైపు గడి అని పేర్కొంటూ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ప్రతీకగా ఈ ప్రాంతం నిలుస్తోందన్నారు. గుడి, గడి కలిసి కొడంగల్‌ను పాడిపంటలతో కళకళలాడే నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కలిసివచ్చారని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే నందారం సూర్యనారాయణ సేవలను సీఎం ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆయన టీటీడీ నుంచి నిధులు తీసుకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అలాగే ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించిన ఆగమశాస్త్ర సలహాదారు సుందరవర్దాచార్యుల సేవలను స్మరించుకున్నారు. ఈ మహత్తర కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు. సుందరవర్దాచార్యుల సేవలను చిరస్థాయిగా నిలుపుకునేందుకు ఆలయ పరిసరాల్లో నిర్మించే విడిదికి ఆయన పేరు పెట్టాలని సూచించారు.
తిరుపతిలో ఏ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారో, అదే విధంగా కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ ఆలయం అభివృద్ధి చెందడం ద్వారా కొడంగల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని అన్నారు. ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదని, కొడంగల్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే దైవ కార్యమని అభివర్ణించారు.

మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సేవలను కూడా సీఎం ప్రస్తావించారు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారని, కొడంగల్ అభివృద్ధి కోసం ఎన్నో విజ్ఞప్తులు చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.
2018 ఎన్నికల్లో తాను ఓడిపోయిన తర్వాత కూడా కొడంగల్ ప్రజలు తనను వదల్లేదని సీఎం గుర్తుచేశారు. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు కొడంగల్ నుంచి అనేక మంది కార్యకర్తలు వచ్చి కష్టపడి గెలిపించారని అన్నారు. ఆ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా నిలబడ్డానని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదల విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఒకప్పుడు కొడంగల్ ప్రజలు విద్య కోసం వికారాబాద్, పరిగి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం గుర్తుచేశారు. నీటి కొరత కారణంగా వ్యవసాయం కష్టమై, అనేక కుటుంబాలు వలసలు వెళ్లాయని చెప్పారు. కొడంగల్ రాష్ట్రంలోనే ఎత్తైన ప్రాంతంగా ఉండటంతో సాగునీటి అవకాశాలు లేకపోయాయని, కందులు తప్ప ఇతర పంటలు పండే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టుకోలేని అమాయకత్వం కొడంగల్ ప్రజలదని వ్యాఖ్యానించిన సీఎం, ఈ రోజు ప్రతి తండాకు, ప్రతి గ్రామపంచాయతీకి రోడ్లు నిర్మించిన ఘనత ప్రజలదేనని అన్నారు. కార్యకర్తలు, నాయకుల కష్టమే తన ఎదుగుదలకు కారణమని మరోసారి స్పష్టం చేశారు.
నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడవాలని ఆకాంక్షించారు. ఈ పథకం కోసం భూసేకరణ బాధ్యతలను మంత్రి శ్రీహరికి అప్పగించగా, నెలరోజుల్లో పూర్తి చేశారని తెలిపారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అడ్డంకులు లేవని, అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.
వికారాబాద్ రైల్వే లైన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. దీని ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
కొడంగల్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని సీఎం తెలిపారు. మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో ఎడ్యుకేషన్ హబ్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు చదువు కోసం కొడంగల్‌కు వచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
లగచర్ల సమీపంలో 2300 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దీనివల్ల కొడంగల్ ప్రాంతం పరిశ్రమల కేంద్రంగా మారుతుందని, వేలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్ వరకు విశాలమైన రహదారి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి అభివృద్ధి కోసం ముందుకు సాగాలని సూచించారు. దౌల్తాబాద్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనులు కూడా చేపడుతున్నామని వెల్లడించారు.
దేశంలోని ప్రముఖ పరిశ్రమలు కొడంగల్ వైపు చూస్తున్నాయని సీఎం అన్నారు. 2009లో ప్రజలు నాటిన మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా మారిందని, ఆ చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని భావోద్వేగంగా చెప్పారు.
2027 డిసెంబర్ నాటికి కొడంగల్‌లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం ప్రకటించారు. సర్పంచ్‌లు ఏ పార్టీ నుంచి గెలిచినా గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
“మనమందరం కలిసి కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



