* ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే…
* మహిళా రిజర్వేషన్ల బిల్లు రేపే తెచ్చినా మద్దతు ఇస్తాం…
* ప్రొరేటా పద్ధతి డీలిమిటేషన్‌తో రాష్ట్రాల మధ్య అంతరం..
* బిల్లుల విషయంలో బీజేపీ, మోదీకి నిజాయితీ లేదు…
* నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాలు, చర్చలు జరపాలి
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్
ఢిల్లీ: మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని… అన్ని వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లారు.. ఆ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పుతో పాటు, రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ భావించింది. ప్రజలు జాగృతమై 240 సీట్లకే బీజేపీని పరిమితం చేశారు. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బీజేపీకి 2/3 వంతుల మెజారిటీ కావాలి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. బిల్లులు వీగిపోవడం కేవలం కేంద్రంలోని అధికార పార్టీ ఓటమే కాదు బీజేపి చిత్తశుద్ది కూడా అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిత్తశుద్ది సరిగా లేనందునే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందన్నారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది బీజేపీ ప్రభుత్వ దురుద్దేశమేనన్నారు. ఈ బిల్లులు వీగిపోవడానికి కారణమైన నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు.

ప్రస్తుతం లోక్ సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, సోమవారం బిల్ పాస్ చేసుకొని… మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణులతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చని సీఎం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతానంటే దేశ ప్రజలు ఒప్పుకోరని, దీంతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మేం యోచిస్తే…దానిని కాంగ్రెస్ అడ్డుకుందని తమను బద్నాం చేసే పనిలో మోదీ, బీజేపీ పడ్డాయని సీఎం విమర్శించారు. అందులో భాగంగానే ఆందోళనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ది చాటుకోవాలని, సరైన పద్ధతిలో బిల్లులు తయారు చేయాలని సీఎం సూచించారు. పార్లమెంట్‌లో ఓడిపోయింది మోదీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు.
* కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీకి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని సీఎం విమర్శించారు. ఉత్తర, దక్షిణాల మధ్య అంతరాలు సృష్టించి అడ్డుగోడలు పెట్టొదని మోదీ, బీజేపీకి సీఎం
హితవు పలికారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని… దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

* మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయన్నారు. 2009 లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో ఆగష్టు 15, 2026 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని సీఎం అన్నారు. ఆ రిజర్వేషన్లతో ప్రధాన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నారు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే… తెలంగాణ సీఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం రంగసామిలతో చర్చలు జరుపుతానని సీఎం తెలిపారు. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతానని చెప్పారు. 2023 లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాలనుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారన్నారు.
* దేశ భవిష్యత్‌ను, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చిందని… దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజననే తప్ప మరేం కాదన్నారు. ప్రతిపక్షాలు నిలువరించింది.. ఓడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్నేనని సీఎం స్పష్టం చేశారు. బిల్లుల విషయంలో బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిజాయితీ లేదని సీఎం విమర్శించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. తమకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చివేస్తామని అమిత్ షా అన్నారని… సోమవారం వరకు సమయం ఉందని, ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే బీజేపీ మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారమే పాస్ చేస్తామని తెలిపారు.

* బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే డీలిమిటేషన్ అని, దేశాన్ని… ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే డీలిమిటేషన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి… బిడ్డను రక్షించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని.. ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మోదీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని సీఎం విమర్శించారు. తాను సూచించిన విధానం కిషన్ రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేమిటని సీఎం ప్రశ్నించారు.

* కాంగ్రెస్‌తోనే మహిళా సాధికారిత…
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననన్నారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కాంగ్రెస్ అందించిందని, లోక్‌సభ స్పీకర్‌గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని… స్వాతాంత్య్రనంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేశారని సీఎం తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని… ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి చేరుకుందన్నారు. 1980లో ఏర్పడిన బీజేపీకి ఇప్పటి వరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరని సీఎం తెలిపారు. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీనిఎలా విమర్శిస్తుందని సీఎం ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్‌లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



