ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూస్తే సహించేది లేదు

  • తప్పు చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి 
  • TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్
  • సిద్దిపేట డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి.. పరిగి డిపో మేనేజర్‌పైనా చర్యలు తీసుకోవాలి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , నవంబర్ 07 :

ఆర్టీసీ కార్మికుల పట్ల కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను చిన్నచూపు చూసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సిద్దిపేట ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని హనుమంతు ముదిరాజ్ పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి, రజాకార్ల పాలనను తలపించే విధంగా అధికారి తన కుర్చీలో కూర్చొని, ఆర్టీసీ ఉద్యోగులను నేలపై కూర్చోబెట్టి మాట్లాడటం కార్మికులను అవమానించడమేనని మండిపడ్డారు. ఇది క్షమించరాని చర్య అని, సంబంధిత డిపో మేనేజర్‌ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సైతం స్పందించి, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఒక కండక్టర్, డ్రైవర్ లేదా శ్రామిక్ చిన్న తప్పు చేసినా వెంటనే సస్పెండ్ చేసే అధికారులు, ఇంతటి తీవ్రమైన తప్పిదానికి పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

పరిగి డిపో మేనేజర్‌పైనా చర్యలు తీసుకోవాలి

అదేవిధంగా గత నెలలో జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందర్భంగా పరిగి డిపో మేనేజర్ వ్యవహరించిన తీరుపైనా హనుమంతు ముదిరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డిపో మేనేజర్ ఒక ఏజెంట్‌గా వ్యవహరిస్తూ కౌంటింగ్ హాల్‌లో కూర్చోవడంతో పాటు, కార్మికులకు ఓటు వేయాలని సూచించడం, పోటీలో ఉన్న అభ్యర్థిని సైతం లోపలికి అనుమతించకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

ఈ విషయంపై ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత డిపో మేనేజర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులకు ఒక న్యాయం.. కార్మికులకు మరో న్యాయమా?

తప్పు చేసిన అధికారులు, కార్మికుల విషయంలో వేర్వేరు నిబంధనలు అమలు చేయడం సరైన పద్ధతి కాదని హనుమంతు ముదిరాజ్ అన్నారు. ఇలాంటి వ్యవహారాలు కొనసాగితే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ స్పందించి సిద్దిపేట, పరిగి డిపో మేనేజర్లపై వచ్చిన ఆరోపణలను విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తప్పు చేసినా, కార్మికులు తప్పు చేసినా అందరికీ ఒకే విధమైన నిబంధనలు, సమానమైన న్యాయం అమలు కావాలని TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles