కొడంగల్‌కు అత్యాధునిక వైద్య మణిహారం

  • 430 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం
  • రూ.255 కోట్లతో అచ్చంపేటలో భారీ వైద్య సముదాయం
  • G+3 నమూనాలో ఐదు బ్లాకులు.. అన్ని విభాగాలతో సమగ్ర వైద్య సేవలు
  • ఇప్పటికే కొడంగల్‌లో 220 పడకల  క్రిటికల్ కేర్ జనరల్ ఆసుపత్రి ప్రారంభం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ సెప్టెంబర్ 7 :

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో వైద్య రంగానికి మహర్దశ రానుంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అత్యాధునిక వైద్య సేవలు అందించే పెద్ద ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర, క్లిష్టమైన వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్‌, తాండూర్‌ తదితర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్యం అందక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కొడంగల్‌ నియోజకవర్గంలో భారీ స్థాయిలో వైద్య మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కొడంగల్‌ నియోజకవర్గంలో వైద్య సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం లభించిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొడంగల్‌లో 220 పడకల కేర్‌ క్రిటికల్‌ కేర్‌ జనరల్‌ ఆసుపత్రి ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు దుద్యాల మండలం అచ్చంపేటలో నిర్మిస్తున్న 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

రూ.255 కోట్లతో భారీ నిర్మాణం

 హకీంపేట్ లో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సదుపాయాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.225 కోట్ల వ్యయం చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఉస్మానియా, నిమ్స్‌, గాంధీ వంటి ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా ఆధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసే లక్ష్యంతో పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల రెండుసార్లు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పనుల తీరుపై ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారి, వెంకటరెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.

G+3 నిర్మాణంలో ఐదు బ్లాకులు

అచ్చంపేటలో నిర్మిస్తున్న ఈ భారీ ఆసుపత్రి G+3 నమూనాలో ఐదు బ్లాకులుగా రూపుదిద్దుకుంటోంది. బ్లాక్‌-A, బ్లాక్‌-B, బ్లాక్‌-C, బ్లాక్‌-D, బ్లాక్‌-Eగా విభజించి వివిధ రకాల వైద్య సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

అత్యవసర వైద్యం నుంచి సాధారణ వైద్యం వరకు, శస్త్రచికిత్సలు, ఐసీయూ సేవలు, చిన్నపిల్లల వైద్యం, స్త్రీల వైద్యం, ఆర్థోపెడిక్‌, కంటి, చెవి-ముక్కు-గొంతు, చర్మవ్యాధులు, మానసిక వైద్యం, దంత వైద్యం తదితర అనేక ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అత్యవసర సేవలు

గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఏ బ్లాక్‌లో పోస్ట్‌ ఆపరేటివ్‌ సేవల కోసం 6 పడకలు, ఐసీయూ కోసం 5 పడకలు, అత్యవసర చికిత్స కోసం 18 పడకలు, ఇతర చికిత్సల కోసం 6 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రెండు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మిస్తున్నారు.

బి బ్లాక్‌లో ఆపరేషన్‌ థియేటర్‌, ఐదు పడకల ఏఎన్‌సీ వార్డు, ఐదు పడకల హెచ్‌డీయూ వార్డు, చికిత్స కోసం మరో ఆరు పడకలు ఏర్పాటు చేయనున్నారు. సాధారణ రోగుల చికిత్సతో పాటు మందుల విభాగం, రేడియాలజీ, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అదేవిధంగా డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌, అత్యవసర ల్యాబొరేటరీ, జనరల్‌ సర్జరీ విభాగాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో రోగులు ఒక్కో పరీక్ష కోసం వేర్వేరు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో సమగ్ర వైద్య సేవలు పొందే అవకాశం ఏర్పడుతుంది.

మొదటి అంతస్తులో ప్రత్యేక వైద్య విభాగాలు

మొదటి అంతస్తులో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ఇతర ప్రత్యేక వైద్య అవసరాలు ఉన్న వారికి సేవలు అందించేలా విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.

గైనకాలజీ, పీడియాట్రిక్‌, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, మానసిక వైద్యం, దంత వైద్యం, చెవి-ముక్కు-గొంతు (ఈఎన్‌టీ), కంటి సంబంధిత వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

దీంతో కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు పరిసర మండలాలు, గ్రామాల ప్రజలు కూడా స్థానికంగానే వివిధ ప్రత్యేక వైద్య సేవలను పొందే అవకాశం ఉంటుంది.

రెండో అంతస్తులో భారీ సంఖ్యలో పడకలు

రెండో అంతస్తులో రోగులకు అవసరమైన విధంగా పెద్ద సంఖ్యలో పడకలను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ రోగుల కోసం 66 పడకలు, చిన్నపిల్లల వైద్యం కోసం 60 పడకలు, ఆర్థోపెడిక్‌ విభాగానికి 40 పడకలు, సాధారణ చికిత్సలకు 134 పడకలు ఏర్పాటు చేయనున్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో పడకలు అందుబాటులోకి రావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన ఇన్‌పేషెంట్‌ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

మూడో అంతస్తులో అత్యవసర, క్రిటికల్‌ కేర్‌ సేవలు

మూడో అంతస్తును అత్యంత కీలకమైన వైద్య సేవలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. చిన్నారుల అత్యవసర వైద్యం కోసం PICU, NICU వార్డుల్లో 20 పడకలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా SCU, ICU, ICCU వంటి క్రిటికల్‌ కేర్‌ విభాగాల్లో 18 పడకలు ఏర్పాటు చేయనున్నారు.

ఆపరేషన్‌ థియేటర్‌కు అనుబంధంగా అనెస్తీషియా, డీఎస్‌ఎస్‌టీ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. కంటి వైద్యం కోసం 20 పడకలు కేటాయించనున్నారు. ఈఎన్‌టీ, చర్మవ్యాధులు, మానసిక వైద్యం తదితర విభాగాలకు కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయనున్నారు. మానసిక వైద్య సేవల కోసం 50 పడకలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.

వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక వసతులు

ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సింగ్‌, సాంకేతిక, ఇతర సిబ్బందికి ప్రత్యేక గదులు, అవసరమైన వసతులను కూడా కల్పించనున్నారు. పరిపాలన విభాగానికి ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.

వైద్య సేవలు అందించే సిబ్బందికి అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు రోగులకు వేగంగా సేవలు అందేలా ఆసుపత్రి అంతర్గత విభాగాలను శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు.

రోజూ 150 మంది కార్మికులతో పనులు

ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. రోజూ సుమారు 150 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

నిర్మాణ పనులు పూర్తయి ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కొడంగల్‌ నియోజకవర్గంలో వైద్య రంగంలో గణనీయమైన మార్పు వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌, తాండూర్‌కు వెళ్లే అవసరం తగ్గే అవకాశం

ఇప్పటివరకు తీవ్రమైన అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సలు, ప్రత్యేక వైద్య సేవల కోసం కొడంగల్‌ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌, తాండూర్‌ వంటి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చేది. ప్రయాణ సమయంలోనే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి.

అచ్చంపేటలో 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగానే వైద్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా కావడంతో పాటు రోగులకు సత్వర చికిత్స అందే అవకాశం ఉంటుంది.

కొడంగల్‌ వైద్య రంగంలో కొత్త అధ్యాయం

ఒకవైపు ఇప్పటికే 220 పడకల కేర్‌ క్రిటికల్‌ కేర్‌ జనరల్‌ ఆసుపత్రి అందుబాటులోకి రావడం, మరోవైపు అచ్చంపేటలో 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుండటంతో కొడంగల్‌ నియోజకవర్గం వైద్య రంగంలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.2,005 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పూర్తయితే కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర చికిత్సలు, క్రిటికల్‌ కేర్‌, శస్త్రచికిత్సలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వివిధ ప్రత్యేక వైద్య విభాగాలకు సంబంధించిన సేవలు ఒకే చోట లభించే అవకాశం ఉండటంతో ఈ ఆసుపత్రి ప్రాంత ప్రజలకు ఒక వైద్య మణిహారంగా నిలవనుంది.

నిర్మాణ పనులు నిర్ణీత గడువులో పూర్తయి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తే కొడంగల్‌ నియోజకవర్గంలో వైద్య మౌలిక వసతులకు కొత్త రూపు రావడంతో పాటు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles