- నాలుగు షాపులపై కేసులు నమోదు..
- రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
- అధికారుల హెచ్చరిక.. వరుస దాడులతో ఎరువుల వ్యాపారుల్లో కలకలం
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ సెప్టెంబర్ 2
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని పలు ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల్లో రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు కొరడా ఝళిపించారు. రైతుల సమస్యలపై బల భీమ న్యూస్ వరుసగా ప్రచురించిన ప్రత్యేక కథనాల నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో దుకాణాల రికార్డులు, స్టాక్ వివరాలు, రిజిస్టర్లు, ఎరువుల బస్తాల నిల్వలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల నుంచి వాంగ్మూలాలను సైతం సేకరించి, వారి ఫిర్యాదులపై నిజనిర్ధారణ చేపట్టారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించిన దుకాణాలపై అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు.

వైష్ణవి ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు
అధికారుల తనిఖీల అనంతరం వైష్ణవి ఫర్టిలైజర్ దుకాణంపై కీలక చర్యలు తీసుకున్నారు. దుకాణంలో నిర్వహించిన తనిఖీలు, రికార్డుల పరిశీలన, రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని దుకాణం లైసెన్సును రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై సంబంధిత దుకాణంలో ఎలాంటి మందులు, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించకూడదని స్పష్టం చేశారు.
రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వాటిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

హోమ్ ట్రేడింగ్‌పై సిక్స్-ఏ కేసు
అదేవిధంగా హోమ్ ట్రేడింగ్ దుకాణంలో నిర్వహించిన తనిఖీల్లో రిజిస్టర్‌లో నమోదైన స్టాక్‌కు, దుకాణంలో ఉన్న ఎరువుల బస్తాల సంఖ్యకు మధ్య తేడాలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సంబంధిత యజమానిపై సిక్స్-ఏ కింద కేసు నమోదు చేసి, దుకాణంలోని స్టాక్‌ను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర అధికార కార్యాలయం నుంచి తదుపరి అనుమతులు వచ్చే వరకు సీజ్ చేసిన స్టాక్‌కు సంబంధించిన ఎలాంటి ఎరువులు, మందులను విక్రయించరాదని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి విక్రయాలు జరిపితే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరో రెండు దుకాణాల యజమానులపై కేసులు
తనిఖీల్లో భాగంగా లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్, రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణాల యజమానులపై కూడా పోలీసు కేసులు నమోదు చేసినట్లు కొడంగల్ ఇన్‌చార్జి ఏడీఏ వెంకటేష్, ఇన్‌చార్జి ఏవో కొమరయ్య తెలిపారు. మొత్తం నాలుగు దుకాణాలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన ఎరువులు, మందులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, స్టాక్ వివరాల్లో అవకతవకలకు పాల్పడటం వంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు తెలిపారు.

మిగతా దుకాణాల్లోనూ తనిఖీలు
ఇప్పటితో తనిఖీలు ముగిసిపోలేదని, మండల పరిధిలోని మరిన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ యథావిధిగా దాడులు, తనిఖీలు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రైతులను మోసం చేస్తూ అధిక ధరలకు ఎరువులు, మందులు విక్రయించే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎరువుల వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, దుకాణాల్లో అందుబాటులో ఉన్న స్టాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు జరపడం, అధిక ధరలు వసూలు చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
రుద్రారంలో ఆరు దుకాణాలు మూసివేత
ఇదిలా ఉండగా, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో మంగళవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఆరు ఫర్టిలైజర్ దుకాణాలు మూకుమ్మడిగా మూసివేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒకేసారి ఆరు దుకాణాలు మూసివేయడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు, స్థానికులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా కొడంగల్ పట్టణంలో కూడా కొన్ని ఫర్టిలైజర్ దుకాణాలు మూసివేయడం పట్ల రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వరుసగా తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో దుకాణాల యజమానులు ముందస్తుగా షాపులు మూసివేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది.

రైతులను మోసం చేస్తే సహించేది లేదు
రైతులకు ఎరువులు, మందులు అవసరమైన సమయంలో కొందరు వ్యాపారులు వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని, మరికొందరు నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు ఎరువులు అత్యవసరంగా ఉండటంతో దుకాణదారులు చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడం అధికార యంత్రాంగానికి తీవ్ర సవాల్‌గా మారింది. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు గతంలో ఎందుకు కఠినంగా వ్యవహరించలేదని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి
ఫర్టిలైజర్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇవ్వడం కాకుండా, అక్రమాలకు పాల్పడినట్లు తేలిన దుకాణాల లైసెన్సులు రద్దు చేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.


