- అధిక ధరలకు యూరియా, డీఏపీ విక్రయాలపై విజిలెన్స్ తనిఖీలు..
- పలు దుకాణాల్లో రికార్డుల పరిశీలన
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ఆగస్టు 31:
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు అందాల్సిన ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా యూరియా, డీఏపీతో పాటు ఇతర వ్యవసాయ మందులు, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది రైతులు ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న వ్యవహారాలను వీడియోల్లో చిత్రీకరించి, వాటిని న్యూస్ ఛానళ్లతో పాటు వివిధ పత్రికలకు అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రైతుల నుంచి ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినప్పటికీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, కొడంగల్ వ్యవసాయ శాఖ అధికారులు తగిన స్థాయిలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కొడంగల్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఐదు దుకాణాల్లో విస్తృత తనిఖీలు
సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొడంగల్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో సోదాలు, రికార్డుల తనిఖీలు చేపట్టారు. రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, హోమ్ ట్రేడింగ్, లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్స్, మన గ్రోమోర్ ఆగ్రోస్, వైష్ణవి ఏజెన్సీస్ తదితర దుకాణాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు, అమ్మకాల వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ధరల పట్టికలు, కొనుగోలు–అమ్మకాల రికార్డులను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. రైతులకు విక్రయిస్తున్న ఎరువులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

అధిక ధరలకు విక్రయాలపై కేసులు
రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, లక్ష్మీనరసింహ ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను నిర్ణీత ధరలకు కాకుండా అదనపు మొత్తాలకు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
రైతులు ఇప్పటికే ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కొంతమంది వ్యాపారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వైష్ణవి ఏజెన్సీపై ఇప్పటికే సస్పెన్షన్?
విజిలెన్స్ అధికారుల తనిఖీల సందర్భంగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వైష్ణవి ఏజెన్సీకి చెందిన ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఎరువులు విక్రయించరాదంటూ సదరు దుకాణం లైసెన్సును 15 రోజులపాటు సస్పెండ్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
అయితే లైసెన్సు సస్పెన్షన్‌కు గురైన దుకాణంపై ప్రస్తుత విజిలెన్స్ తనిఖీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు కొడంగల్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఓం ట్రేడింగ్ దుకాణంలో రికార్డులు, స్టాక్‌లో తేడాలు?
ఓం ట్రేడింగ్ ఫర్టిలైజర్ దుకాణంలో రికార్డుల్లో నమోదైన నిల్వలకు, వాస్తవంగా ఉన్న మందులు, ఎరువుల నిల్వలకు మధ్య తేడాలు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా అధిక ధరలకు వ్యవసాయ మందులు, ఎరువులు విక్రయిస్తున్నారని కొంతమంది రైతులు అధికారుల ఎదుటే స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.
దుకాణంలో రికార్డుల నిర్వహణలో లోపాలు, స్టాక్ వివరాల్లో వ్యత్యాసాలు, ధరల విషయంలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అక్రమాలు రుజువైతే సదరు దుకాణం లైసెన్సును రద్దు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
చర్యల్లో తేడాలపై వ్యాపారుల ప్రశ్నలు
అయితే ఒకే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న దుకాణాల విషయంలో అధికారులు వేర్వేరు విధానాలను అవలంబిస్తున్నారనే ఆరోపణలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైష్ణవి ఏజెన్సీపై గతంలోనే వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుని 15 రోజులపాటు లైసెన్సు సస్పెండ్ చేసినట్లు తేలిన నేపథ్యంలో, అదే దుకాణంపై విజిలెన్స్ అధికారులు మరింత లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అలా జరగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర దుకాణాలపై కేసులు నమోదు చేయడం, లైసెన్సులు రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టడం, అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో దుకాణంపై తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించడం ఎందుకనే ప్రశ్నలు వ్యాపార సంస్థల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రైతుల్లో మళ్లీ ఆందోళన
ఎరువుల విషయంలో అక్రమాలు, అధిక ధరల విక్రయాలు కొనసాగితే చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు సమయంలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు అత్యవసరంగా అవసరమవుతాయని, ఆ సమయంలో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండేలా ఎరువులను సరఫరా చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొంతమంది వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తే మొత్తం వ్యవస్థపై రైతుల్లో అనుమానాలు ఏర్పడతాయని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అందువల్ల ఎరువుల దుకాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పారదర్శక విచారణకు డిమాండ్
కొడంగల్ నియోజకవర్గంలోని ఎరువుల దుకాణాల్లో జరిగిన తనిఖీలను కేవలం ఒకరోజు చర్యలకే పరిమితం చేయకుండా, గత కొంతకాలంగా జరిగిన ఎరువుల కొనుగోళ్లు, అమ్మకాలు, స్టాక్ వివరాలు, రైతులకు జారీ చేసిన బిల్లులు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ముఖ్యంగా రైతుల నుంచి వచ్చిన వీడియోలు, ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటకు తీసుకురావాలని వారు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే సంబంధిత దుకాణాల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వైష్ణవి ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలన్న రైతులు
వైష్ణవి ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణానికి సంబంధించి గతంలోనే లైసెన్సు సస్పెన్షన్ జరిగినట్లు అధికారులు నిర్వహించిన విచారణలో తేలిందని సమాచారం వెలువడిన నేపథ్యంలో, సదరు దుకాణంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కొడంగల్ మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయితే లైసెన్సును రద్దు చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. అన్ని దుకాణాలపై ఒకే విధమైన నిబంధనలు, ఒకే విధమైన చర్యలు అమలు చేసినప్పుడే రైతుల్లో అధికారులపై నమ్మకం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించడం, రికార్డుల్లో తేడాలు చూపించడం, రైతులకు బిల్లులు ఇవ్వకపోవడం లేదా ఇతర అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


