- ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.8–10 కోట్ల వసూళ్లు..
- ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లతో మోసం
శ్రీ బల భీమ న్యూస్ / హైదరాబాద్ ఆగస్టు 29:
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు అందించారనే ఆరోపణలపై భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏ కళ్యాణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ ఉద్యోగాలు, థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు, ఐటీసీ పేపర్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురు నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా దాదాపు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్న అనంతరం బాధితులకు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఏడు నెలలుగా ఆరోపణలు.. చర్యలు లేవా?
కళ్యాణ్ కుమార్ వ్యవహారం గురించి సుమారు ఏడు నెలల క్రితమే ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు సమాచారం ఉన్నప్పటికీ, ఆయన తన పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
మూడు రోజులుగా పరారీ
కేసు నమోదు కావడంతో కళ్యాణ్ కుమార్ గత మూడు రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించిన బాధితుల వివరాలను సేకరిస్తూ, నకిలీ నియామక పత్రాల వ్యవహారంపైనా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో నగదు వసూలు చేశారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.


