- ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా ఎరువుల విక్రయాలు..
- ప్రశ్నిస్తే “స్టాక్ లేదు” అంటూ దబాయింపులు
- దుకాణాల నుంచి రైతులను బయటకు పంపుతున్నారంటూ ఆరోపణలు..
- కొడంగల్‌లో వ్యవసాయ అధికారుల కొరతపై తీవ్ర విమర్శలు
- రైతుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఇన్‌చార్జి ఏడీఏ వెంకటేష్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, ఆగస్టు 22:
కొడంగల్ నియోజకవర్గంలో ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు, పురుగుమందులు విక్రయించాల్సిన ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో యూరియా కోసం నమోదు చేసుకున్నప్పటికీ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమను ప్రశ్నించిన రైతులకు “స్టాక్ లేదు” అంటూ సమాధానం చెప్పడమే కాకుండా, కొన్నిచోట్ల దుకాణాల నుంచి బయటకు పంపుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నా.. అదనపు వసూళ్లు?
కొడంగల్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు కేంద్రంలో యూరియా విక్రయాలపై గత రెండు రోజుల క్రితం రైతులు పలు ఆరోపణలు చేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో యూరియా కోసం నమోదు చేసుకున్న రైతుల నుంచి కూడా అదనంగా రూ.200 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారని రైతులు మీడియా ఎదుట వాపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎరువుల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ ఎంతమేరకు ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సెల్‌ఫోన్‌లో వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
ఈ క్రమంలో శనివారం కొడంగల్ బస్టాండ్ సమీపంలోని వైష్ణవి ఫర్టిలైజర్ దుకాణంలో చోటుచేసుకున్న ఘటనపై చర్చ మొదలైంది. పర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు డీఏపీ కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్లగా, అక్కడ యజమాని వ్యవహరించిన తీరుపై అనుమానం రావడంతో తన సెల్‌ఫోన్‌లో జరిగిన విషయాలను రికార్డు చేసినట్లు సమాచారం. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎరువుల దుకాణాల్లో జరుగుతున్న విక్రయాల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది.
రైతులు చెబుతున్న ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
అధికారుల కొరతతో రైతులకు ఇబ్బందులు
మరోవైపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడీఏ, ఏవో, ఏఈవో తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలు సకాలంలో అందడం లేదని ఆరోపిస్తున్నారు.
దౌల్తాబాద్, దుద్యాల మండలాలకు ఒకే ఒక్క ఏవో ఉండటం, బొంరాస్‌పేట్, కొడంగల్ మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారుల కొరత ఉండటంతో పరిపాలన ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలు వికారాబాద్ ఏడీఏకు అప్పగించడంతో రెండు ప్రాంతాల బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అధికారులకు కూడా భారంగా మారిందని అంటున్నారు.
అధికారుల కొరతను అదునుగా చేసుకుంటున్నారా?
వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడాన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము నిర్ణయించిన ధరలకే రైతులు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల ధరలపై ప్రశ్నిస్తే “స్టాక్ లేదు” అని చెబుతున్నారని, అయితే దుకాణాల్లో స్టాక్ బోర్డులపై ఎరువుల నిల్వలు కనిపిస్తున్నప్పటికీ విక్రయాలకు నిరాకరిస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. అదనంగా ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
యూరియా పక్కదారి వ్యవహారంపైనా అనుమానాలు
ఇటీవల కొడంగల్ పట్టణంలోని మన గ్రోమోర్‌కు సంబంధించిన యూరియా పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అందాల్సిన యూరియా కొందరి ద్వారా ఇతర మార్గాల్లోకి వెళ్లిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న రైతులకు యూరియా అందకుండా, అదనంగా ఇతర మందులు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారనే ఆరోపణలపై కూడా అధికారులు విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యవహారాల వెనుక ఎవరైనా కుమ్మక్కయ్యారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, వాటిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
“ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు”
ఈ ఆరోపణలపై కొడంగల్ ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేష్ స్పందిస్తూ, కొడంగల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ, ఏవో, ఏఈవో పోస్టులు ఖాళీగా ఉన్న విషయం వాస్తవమేనని తెలిపారు. వికారాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొన్నారు.
రైతుల నుంచి ఫిర్యాదులు అందితే సంబంధిత ఎరువుల దుకాణాలపై వెంటనే విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల లైసెన్సులను కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, పురుగుమందులు విక్రయించాల్సి ఉంటుందని చెప్పారు. స్టాక్ బోర్డులో ఎరువుల నిల్వలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ “నో స్టాక్” అని చెప్పడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తే తప్పనిసరిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: రైతుల డిమాండ్
కొడంగల్ నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా వ్యవసాయ శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులకు సంబంధించిన శాఖలో అధికారులు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అంటున్నారు.
తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ శాఖలో అధికారుల కొరత, మరోవైపు ఎరువుల దుకాణాల్లో అధిక ధరల విక్రయాల ఆరోపణలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంటున్నారు.
సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ఫర్టిలైజర్, పురుగుమందుల దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, స్టాక్ బోర్డులు, విక్రయ ధరలు, ఆన్‌లైన్ బుకింగ్ వివరాలను పరిశీలించాలని కోరుతున్నారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగాయా? రైతులపై అదనపు ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేశారా? ప్రభుత్వం సరఫరా చేసిన ఎరువులు పక్కదారి పట్టాయా? వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న వ్యవసాయ శాఖ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి మండలానికి తగిన సంఖ్యలో అధికారులు, ఏఈవోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


