తెలంగాణ విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు: కల్వకుంట్ల కవిత

  • జీఓ 150 రద్దు చేయాలి.. నాలుగేళ్ల స్థానికత నిబంధనతో ఇతర రాష్ట్రాల విద్యార్థులకే లబ్ధి

శ్రీ బల భీమ న్యూస్ / హైదరాబాద్ ఆగస్టు 21 :

తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నీట్‌ ర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులు కవితను కలిసి తమ సమస్యలను వివరించారు.

2024లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్‌ 150 కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో మెడికల్‌ సీట్లు దక్కుతున్నాయని తల్లిదండ్రులు కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి జీఓ నంబర్‌ 150ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తించేలా నిబంధనలు రూపొందించడం వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందని కవిత పేర్కొన్నారు. ఏటా సుమారు 1,500 నుంచి 2,000 వరకు మెడికల్‌ సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్నాయని, అదే స్థాయిలో తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు.

ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడేళ్లు ఏ రాష్ట్రంలో చదివితే ఆ రాష్ట్రంలో స్థానికత వర్తించేలా గతంలో ఉన్న నిబంధనలను పునరుద్ధరించాలని సూచించారు. నీట్‌ కారణంగా ఇప్పటికే 15 శాతం సీట్లు కోల్పోతున్నామని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై ప్రభుత్వం అత్యంత సున్నితంగా వ్యవహరించాలని కోరారు.

విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్‌ చేశారు.

  1. రాహుల్‌జీ.. తెలంగాణ విద్యార్థులపై పోలీసుల అఘాయిత్యాలు కనిపించవా?
  2. ఢిల్లీలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయమా? అంటూ కవిత ప్రశ్న

తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలిని ఖండించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యార్థులపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె నిలదీశారు.

ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా కవిత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ రాహుల్‌గాంధీ విద్యార్థులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో అంతకంటే తీవ్రమైన ఘటనలు జరుగుతున్నప్పటికీ ఆయన స్పందించకపోవడం బాధాకరమన్నారు.

జీఓ 97కు వ్యతిరేకంగా ఈ నెల 19న మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద పాలిటెక్నిక్‌ విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టిన విషయాన్ని కవిత ప్రస్తావించారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ధర్నా చేస్తే స్థానిక సీఐ ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకుని వెనక్కి నెట్టిన ఘటనపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో విద్యార్థులను నేరస్తుల్లా చూడటం సరికాదని కవిత అన్నారు. ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న పోలీసుల చర్యలపై రాహుల్‌గాంధీ స్పందించాలని కవిత డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో విద్యార్థులు, ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles