కొడంగల్‌లో అక్రమ ఇసుక రవాణా రాజ్యమేలుతోందా..?

  • అరికట్టాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా..?
  • ప్రజలు, ప్రజాసంఘాల నాయకుల నుంచి తీవ్ర ఆరోపణలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ప్రతినిధి, జూలై 06 : 

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొంతమంది అధికారులు అక్రమ వ్యాపారుల పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు పట్టణ ప్రజలు, పలు ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి.

కొడంగల్ పట్టణం పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అక్రమ ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్, విజిలెన్స్, పోలీసు శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై పలు మార్లు వార్తా కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.

 

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ఈ అంశంపై మరింత చర్చకు దారితీసింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు లారీలు కొడంగల్ ప్రాంతంలో సంచరించాయనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేదా చర్యలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు తిరగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమ వ్యవస్థ పనిచేస్తోందా అనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

కొడంగల్‌లో అక్రమ ఇసుక వ్యాపారం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ వ్యాపారులు సంబంధిత శాఖల అధికారులతో కుమ్మక్కయ్యారా? నెలనెలా మామూళ్ల పేరుతో వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ అంశంపై పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిసార్లు ప్రజలే ముందుకు వచ్చి అనుమానాస్పద వాహనాలను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ, ఆ ఘటనలపై కేసులు నమోదు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో పోలీసుల పాత్రపై కూడా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొడంగల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనధికారిక డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక నిల్వలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ డంపింగ్ కేంద్రాలకు సంబంధించి తగిన అనుమతులు ఉన్నాయా? లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అనే విషయాలపై ఇప్పటివరకు సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఒకవైపు కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాల భాగంగా బొమ్మరాస్పేట మండలంలోని కొన్ని గ్రామాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఆ అనుమతులను దుర్వినియోగం చేస్తూ అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక అనుమతులను పక్కనబెట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే విమర్శలు కూడా వెలువడుతున్నాయి.

స్థానిక ప్రజల ఆరోపణల ప్రకారం, కొందరు అక్రమ వ్యాపారులు అధికారులను ప్రభావితం చేసి తమ కార్యకలాపాలను నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి ప్రత్యేకంగా డబ్బులు తీసుకుని అక్రమ రవాణాను అనుమతిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

ఇటీవల కొంతమంది ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు కలిసి కొడంగల్ ఎమ్మార్వోకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. అయినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, లేకపోతే కొడంగల్ ప్రాంతంలో సహజ వనరులు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం కొడంగల్ ప్రజల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా? అక్రమంగా కొనసాగుతున్న డంపింగ్ కేంద్రాలను మూసివేస్తారా? లేకపోతే ఇప్పటివరకు కొనసాగుతున్న పరిస్థితులు యథావిధిగా కొనసాగుతాయా? అనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles