- 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: నిరుద్యోగుల ధర్నాలో కల్వకుంట్ల కవిత ఫైర్
శ్రీ బల భీమ న్యూస్ /హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్:
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

“బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావ్. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. నిప్పురవ్వలతో ఆటలాడుతున్నావ్. నిన్ను గద్దె దించే వరకు వారు వదిలిపెట్టరు” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని కవిత అన్నారు. గతంలో ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, డీజీపీ సహా పలువురు అధికారులు 19 వేలకుపైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కేవలం 5 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రయత్నించడం తీవ్ర అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు.
“మేము అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు కూడా 19 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మాట మార్చి 5 వేల ఉద్యోగాలు మాత్రమే అంటున్నారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే” అని కవిత అన్నారు. ప్రభుత్వం వెంటనే 19,200 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువతకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ఉద్యమం పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గబోమని ఆమె స్పష్టం చేశారు. “నేను ఏ అంశాన్ని తీసుకున్నా దాని పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టను. కానిస్టేబుల్ ఉద్యోగాల విషయంలో కూడా తప్పకుండా అనుకున్నది సాధిస్తాం” అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని కవిత గుర్తు చేశారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఉద్యమం చేశామని, ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వేలాది మంది మహిళల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.
“రేవంత్ రెడ్డికి కూడా ఒక కుమార్తె ఉంది. ఉద్యోగాల కోసం ఇళ్లను వదిలి వచ్చి శిక్షణ పొందుతున్న ఆడబిడ్డల బాధను ఆయన అర్థం చేసుకోవాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. 19 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తే శిక్షణ ఇవ్వడం కష్టమని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇదే విషయం అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.
వయోపరిమితి సడలింపు విషయంలో కూడా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని కవిత ఆరోపించారు. గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 31 ద్వారా వయోపరిమితి సడలింపు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని తిరస్కరిస్తూ మరో జీవో తీసుకురావడం నిరుద్యోగులపై ద్రోహమని విమర్శించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలపైనా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.7 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును చేపడతామని చెబుతున్నారని, అయితే ఆ ప్రాజెక్టును ప్రజలు ఎవరూ కోరలేదని అన్నారు. పేదల ఇళ్లను తొలగిస్తూ అభివృద్ధి పేరుతో ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.
“ఇది ప్రజా ప్రభుత్వం కాదు. ఇది జఫ్పా ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది” అని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జులై 2న నిరుద్యోగులు సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, అదే రోజు ఉద్యమకారులతో కలిసి భూపోరాట కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. అవసరమైతే ఉద్యమకారులంతా నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తారని స్పష్టం చేశారు.

“నిరుద్యోగులు ఒంటరి వారు కాదు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వారికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు అందరూ కలిసి పోరాడతారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలి” అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత, మహిళలు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నిరుద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



