క్యాన్సర్ స్క్రీనింగ్ పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక

  • ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేకు శ్రీకారం
  • క్యాన్సర్ అవగాహన, ముందస్తు గుర్తింపే లక్ష్యమని వైద్యాధికారుల వెల్లడి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 24:

రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించడం, ముందస్తు గుర్తింపు ద్వారా ప్రాణాలను కాపాడడం లక్ష్యంగా ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి కొడంగల్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ మరియు కొడంగల్ మెడికల్ కళాశాల ఆర్‌ఎంఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు.

బుధవారం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఇండియన్ ప్లేస్, ప్రషో సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక వైద్య బృందం మధ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అమలు విధానం, ఇంటింటి సర్వే, వైద్య పరీక్షలు, గ్రామస్థులకు అందించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వైద్యాధికారులు మాట్లాడుతూ, కొడంగల్ మండల పరిధిలోని అన్నారం, రుద్రారం, హస్నాబాద్, అప్పాయిపల్లి, పెద్ద నందిగామ, రావులపల్లి గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ గ్రామాల్లో హైదరాబాద్ మరియు ముంబై నగరాల నుంచి ప్రత్యేకంగా వచ్చే వైద్య నిపుణులు, శిక్షణ పొందిన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించనున్నారని చెప్పారు.

ఈ సర్వేలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్), అలాగే ఓరల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్న మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులపై కూడా పరీక్షలు చేపట్టనున్నారు.

ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని, ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి వ్యాధుల లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ఆయా గ్రామాలకు చెందిన వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది ఎన్జీవో ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేయనున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజలకు సులభంగా ఆరోగ్య సేవలు అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించే సర్వే ద్వారా సేకరించే సమాచారం, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు. కొడంగల్‌లో విజయవంతంగా అమలు అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నమూనాను విస్తరించే దిశగా ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు చర్యలు తీసుకునే అవకాశముందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో గ్రామాల వారీగా చేపట్టాల్సిన సర్వే విధానం, పరీక్షల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, డేటా సేకరణ, ఆరోగ్య నివేదికల తయారీ తదితర అంశాలపై సవివరంగా చర్చించారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ మరియు ఎన్జీవో ప్రతినిధులకు మర్యాదపూర్వకంగా ఘన సత్కారం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సాకేత్, వైద్య నిపుణులు, ఎన్జీవో ప్రతినిధులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్ మండలాన్ని క్యాన్సర్ స్కానింగ్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరగడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించే అవకాశాలు మెరుగుపడనున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles