మల్కాజిగిరి అభివృద్ధికి రూ.1600 కోట్ల పనులకు శంకుస్థాపన

  • మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ / ఉప్పల్, జూన్ 7:

తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆధారంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉప్పల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు.

సభకు భారీ సంఖ్యలో హాజరైన మహిళలను ఉద్దేశించి సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళల ఆశీస్సుల వల్లే తాను జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. ప్రతి సభలో మహిళలకు ముందు వరుసలో కూర్చునే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు స్వార్థం లేకుండా తనకు అండగా నిలిచారని, వారి ఆశీర్వాదాలను జీవితాంతం మరువలేనని అన్నారు.

కొడంగల్‌లో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించి ఆదుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మినీ భారతదేశం వంటిదని, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాల వల్లే తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అనంతరం ముఖ్యమంత్రిగా ఎదిగానని చెప్పారు.

గత ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఎంపీగా ఉన్న సమయంలో మల్కాజిగిరిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలో గతంలో నాలుగు రకాల పరిపాలనా వ్యవస్థలు ఉండటంతో శాఖల మధ్య సమన్వయం లోపించి అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని తెలిపారు. మున్సిపల్, పోలీసు శాఖల పరిధులు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు. కొందరు ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని విమర్శిస్తున్నప్పటికీ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు.

మల్కాజిగిరి ప్రాంత అభివృద్ధికి అవసరమైన రోడ్లు, చెరువుల సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, మెట్రో రైలు విస్తరణ వంటి అన్ని పనులకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజా ప్రయోజనాల కోసం సమానంగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగా రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసినప్పుడు ప్రశంసించినవారు, హైదరాబాద్‌లో మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హైదరాబాద్‌కు కొత్త పర్యాటక ఆకర్షణగా మారుతుందని తెలిపారు. ప్రస్తుతం మూసీ కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడం లేదని, నల్గొండ జిల్లాలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

మూసీ కాలుష్యంపై ప్రజల ఆవేదన తెలుసుకునేందుకే గతంలో పాదయాత్ర చేశానని సీఎం గుర్తు చేశారు. ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు ఇళ్లు, విద్య, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ కొందరు రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంపై కూడా సీఎం విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అన్ని అనుమతులు సిద్ధమైనప్పటికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు అని సీఎం అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం గత రెండున్నర సంవత్సరాలుగా అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశానని తెలిపారు. అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పురోగతి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం మరింత చొరవ చూపాలని సీఎం సూచించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో కేంద్ర సహకారం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులపై ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, మిగిలిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సీఎం పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు మాట్లాడుకోవచ్చని, ప్రస్తుతం మాత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉప్పల్ ప్రాంతానికి నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సేవలను సీఎం కొనియాడారు. ఆయన పేరును ఎలివేటెడ్ కారిడార్‌కు పెట్టడం రాజకీయ కారణాలతో కాదని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మాత్రమేనని స్పష్టం చేశారు.

మూసీ ప్రక్షాళన రెండో దశలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు పనులు చేపడతామని, వంద రోజుల్లో కార్యాచరణ ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణను ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles